లండన్ చేరుకున్న మంత్రి నారాయణ బృందం

by Thanuru Gopichand |

పర్యటన ద్వారా సేకరించిన ఉత్తమ పద్ధతులను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మిళితం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

లండన్ చేరుకున్న మంత్రి నారాయణ బృందం
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాజధాని అమరావతిని (Amaravati) ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ (Minister Narayana) నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం సోమవారం లండన్‌ చేరుకుంది. అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఆధునిక పట్టణ ప్రణాళికలను అధ్యయనం చేసేందుకు ఈ పర్యటనను బృందం సభ్యులు చేపట్టారు. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ తొలుత లండన్ సిటీ కార్పొరేషన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ గ్విన్ రిచర్డ్స్‌తో కీలక సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా లండన్ నగర అభివృద్ధిలో అనుసరిస్తున్న వ్యూహాలు, అమరావతి నిర్మాణంలో అంతర్జాతీయ సహకారంపై వారు చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం బృందం సభ్యులు చారిత్రక 'బెటర్సీ పవర్ స్టేషన్‌'ను సందర్శించి, అక్కడ జరుగుతున్న పట్టణ పునరుద్ధరణ పనులను పరిశీలించనున్నారు. సాయంత్రం వేళ థేమ్స్ నది పరివాహక ప్రాంతంలోని లండన్ బ్రిడ్జి నిర్మాణ శైలిని, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఈ బృందంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ కూడా ఉన్నారు. లండన్ పర్యటన ద్వారా సేకరించిన ఉత్తమ పద్ధతులను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మిళితం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story