ముగిసిన మలేషియా పర్యటన.. విజ‌య‌వాడకు మంత్రి నారాయణ

by Vemula.Srinu Prasad |

ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి పట్టణాభివృద్ధి, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, అందుబాటు ధరలో గృహ నిర్మాణం వంటి అంశాల అమలుకు అవసరమైన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు మలేషియాలో పర్యటిస్తున్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. ..

ముగిసిన మలేషియా పర్యటన.. విజ‌య‌వాడకు మంత్రి నారాయణ
X

దిశ‌, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచ స్థాయి పట్టణాభివృద్ధి, ఆధునిక వ్యర్థాల నిర్వహణ, అందుబాటు ధరలో గృహ నిర్మాణం వంటి అంశాల అమలుకు అవసరమైన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు మలేషియాలో పర్యటిస్తున్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రెండో రోజు పర్యటనను విజయవంతంగా పూర్తి చేశారు. శుక్ర‌వారం ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ హిత పట్టణాభివృద్ధి, తక్కువ ధరలో గృహ నిర్మాణ ప్రాజెక్టులను అధ్యయనం చేశారు. సెలాంగోర్ రాష్ట్రంలోని బుకిత్ తగర్ ఎన్విరో పార్క్‌ను సందర్శించారు. మలేషియాలో అతిపెద్ద శానిటరీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతంగా పేరుగాంచిన ఈ కేంద్రంలో ఘన వ్యర్థాలను పర్యావరణానికి హాని కలగకుండా శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్న తీరును పరిశీలించారు. వ్యర్థాలను భూమిలో పూడ్చిపెట్టే విధానం, భూగర్భ జలాలు మరియు పరిసర ప్రాంతాలు కలుషితం కాకుండా తీసుకుంటున్న చర్యలను అక్కడి అధికారులు మంత్రికి వివరించారు.

అనంతరం సౌత్ క్లాంగ్ ప్రాంతంలో 1,530 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఆధునిక టౌన్‌షిప్‌ను మంత్రి పరిశీలించారు. పర్యావరణ హిత విధానాలతో, కాలుష్య నియంత్రణ చర్యలతో పాటు సమగ్ర మౌలిక వసతులను కల్పిస్తూ పట్టణాన్ని అభివృద్ధి చేసిన తీరుపై మంత్రి ఆసక్తి కనబరిచారు.

నేడు విజ‌య‌వాడ చేరుకోనున్న మంత్రి

అనంత‌రం ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థలు సన్‌వే, గముడా ప్రాజెక్టుల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యర్థాల నిర్వహణ రంగాల్లో అమలు చేస్తున్న ఆధునిక విధానాలపై చర్చించారు.

మలేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న మంత్రి నారాయణ రాష్ర్టానికి తిరుగు ప్రయాణం అయ్యారు. శనివారం ఉదయం హైదరాబాద్ మీదుగా విజయవాడకు చేరుకోనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి, ఘన వ్యర్థాల నిర్వహణ, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణ కార్యక్రమాల మెరుగుదలకు ఈ పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలు ఉపయోగపడతాయని ఎంఏయూడీ అధికారులు తెలిపారు.

Next Story