మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-02 14:34:47  IST  )

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి నారాయణ అన్నారు...

మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free Bus Journey Scheme) ఖచ్చితంగా అమలు చేస్తామని మంత్రి నారాయణ(Minister Narayana) అన్నారు. నెల్లూరులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రజలు అమాయకులు కాదని, ఏ ప్రభుత్వం పని చేస్తుందో వాళ్లకు తెలుసన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, గతంలో మాదిరిగా అరాచకాలు లేవని నారాయణ చెప్పారు.


ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ వస్తున్నామని నారాయణ తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ రూ. 4 వేలు, వికలాంగుల పింఛన్‌ను రూ. 6 వేలు, తల్లికి వందనం ద్వారా పిల్లలందరికీ డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని తెలిపారు. తాము చేసిన సేవలను ప్రతి ఇంటికి వెళ్లి తెలుసుకుంటున్నామని, అలాగే వాళ్ల సమస్యలను పరిష్కరిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Next Story