Nara Lokesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ విషెస్

by Ramesh Naini |

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమరజీవి జలధార’ పథకానికి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

Nara Lokesh: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ విషెస్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Amarajeevi Jaladhara Scheme) ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘అమరజీవి జలధార’ పథకానికి మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే సంకల్పంతో పవన్ కల్యాణ్ చేపట్టిన భగీరథ ప్రయత్నం ఫలించిందని లోకేశ్ ప్రశంసించారు. ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మరో హామీని నెరవేర్చారని పేర్కొంటూ, పవన్ కల్యాణ్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

లోకేశ్ ట్వీట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ప్రజలందరికీ రోజుకు కనీసం 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చనున్న ‘అమరజీవి జలధార ప్రాజెక్ట్’కు అభినందనలు తెలిపిన మిత్రులు, సహచర మంత్రి నారా లోకేశ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

అలాగే, ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మను నిరంతరం స్మరించుకునేలా మధ్యాహ్న భోజన పథకానికి నామకరణం చేసినందుకు కూడా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆమె జన్మించిన గోదావరి నేల నుంచే ఈ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Next Story