మంత్రి చొరవతో పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ చేసిన వైద్యులు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-18 09:59:22  IST  )

హైదరాబాద్ రెయిన్ బో ఆస్పత్రిలో మంత్రి లోకేశ్ సమక్షంలో వైద్యులు చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేశారు.

మంత్రి చొరవతో పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్ల ఇంజెక్షన్ చేసిన వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: అరుదైన వ్యాధితో మృత్యువుతో పోరాడుతున్న సుమారు ఏడాది వయసున్న చిన్నారి పునర్వికకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్‌ను రప్పించి, ఆ చిన్నారి ప్రాణాలను కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన జంపాల మంగళ సురేశ్ కుమార్ క్షవర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయన ఏడాది కుమార్తె పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA Type-1) అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లల కండరాలు క్రమంగా క్షీణించి ప్రాణాపాయం సంభవిస్తుంది. దీనికి ఏకైక మార్గం అమెరికా నుంచి వచ్చే 'జోల్ జెన్ స్మా' (Zolgensma) అనే జీన్ థెరపీ ఇంజెక్షన్. దీని ధర అక్షరాలా రూ.16 కోట్లు.

మాట నిలబెట్టుకున్న లోకేశ్

రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబం అంత భారీ మొత్తాన్ని భరించడం అసాధ్యం. ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జగదీష్, రుద్రరాజు శివ ఫండ్స్ కోసం నడుంబిగించారు. ఊరూర తిరిగి, ఇతర ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా కూడా కొంత నగదును సేకరించారు. అలాగే చిన్నారికి ఇంజెక్షన్ చేయించేందుకు సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా.. నారా లోకేశ్ స్పందించి.. ఇకపై పాప బాధ్యత తాను తీసుకుంటానని, ఇంజెక్షన్ చేయించే బాధ్యత తనదని మాటిచ్చారు. ఇచ్చిన మాటను మంత్రి నిలబెట్టుకున్నారు. దాతల సహకారం, క్రౌడ్ ఫండింగ్, ఇతర మార్గాల ద్వారా నిధులు సేకరించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అమెరికా నుంచి ఆ ఇంజెక్షన్ హైదరాబాద్‌కు సకాలంలో చేరేలా చొరవ తీసుకున్నారు. శనివారం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆస్పత్రిలో మంత్రి లోకేశ్ సమక్షంలోనే వైద్యులు చిన్నారి పునర్వికకు ఈ ఖరీదైన ఇంజెక్షన్‌ను ఇచ్చారు. చికిత్స విజయవంతం కావడంతో లోకేశ్ ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ముద్దాడారు. తన బిడ్డకు పునర్జన్మ నిచ్చిన మంత్రి లోకేశ్, సహకరించిన వైద్యులకు, ప్రజలకు పునర్విక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఆ చిన్నారి బోసినవ్వుల్ని చూసేందుకు సహాయం చేసినవారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

Next Story