ఉద్యోగాల కల్పనే లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు.

ఉద్యోగాల కల్పనే లక్ష్యం.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ క్రమంలో నేడు(మంగళవారం) ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజిఎస్ శాఖల ఉన్నతాధికారులతో ఉండవల్లి నివాసం లో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జిసిసి), డాటా సెంటర్ల ఏర్పాటుకు ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని అన్నారు. ఆ సంస్థలు త్వరితగతిన తమ యూనిట్లను ఏర్పాటు చేయడానికి అవసరమైన అనుమతులు, ఇతర సౌకర్యాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మక సంస్థలైన టిసిఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో ఇప్పటికే భూకేటాయింపులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. ఆ సంస్థలు సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇటీవల తమ బెంగళూరు పర్యటనలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(జిసిసి)ల ఏర్పాటుకు ఎఎన్ఎస్ఆర్, సత్వ సంస్థలు ఎంఓయులు కుదుర్చుకున్నాయని, ఈ రెండింటి ద్వారానే యువతకు 35 వేల ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు.

ఎంఓయూలు చేసుకున్న సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యూనిట్లు ఏర్పాటు చేసేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే చిన్న సంస్థల కోసం 26 జిల్లా కేంద్రాల్లో కో వర్కింగ్ స్పేస్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో నవీన ఆవిష్కరణలు, స్టార్టప్ ల ప్రోత్సాహానికి తలపెట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.

Next Story