ఏపీపీఎస్సీ నియామకాల చట్టసవరణ బిల్లు : ఫ్యాక్షన్ రాజకీయాలపై లోకేశ్ ఫైర్

by Naga Rani Yarlagadda |

ఏపీపీఎస్సీ నియామకాల చట్టసవరణ బిల్లు : ఫ్యాక్షన్ రాజకీయాలపై లోకేశ్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 'ఏపీ పబ్లిక్ సర్వీసు నియామకాల బిల్లు' సవరణపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. రాజకీయ హత్యలకు గురైన కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లు, గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి మళ్లీ సభ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. "2025 సెప్టెంబర్ 27న ఈ బిల్లును అసెంబ్లీ ఆమోదించి మండలికి పంపించాం. కానీ అక్కడ 100 రోజులు దాటినా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో, నిబంధనల ప్రకారం మళ్లీ ఈ బిల్లు అసెంబ్లీకి వచ్చింది. మండలి తిరస్కరించినా, పక్కన పెట్టినా సభలో మళ్లీ ఆమోదించుకునే అధికారం మనకు ఉంది" అని స్పష్టం చేశారు.

ఫ్యాక్షన్ రాజకీయాలపై యుద్ధం

రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాల చరిత్రను ప్రస్తావిస్తూ.. 1996లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఫ్యాక్షన్‌పై యుద్ధం ప్రకటించారని లోకేష్ గుర్తుచేశారు. 2004 తర్వాత వైఎస్ హయాంలో ఏకంగా 164 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యకు గురైన వారి పిల్లలు మళ్లీ ఫ్యాక్షన్ బాట పట్టకుండా.. వారికి మంచి భవిష్యత్తును ఇచ్చేందుకు ఎన్టీఆర్ స్కూళ్లలో చదివించి ప్రయోజకులను చేశామని తెలిపారు.

చంద్రయ్య త్యాగానికి గుర్తింపు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన దాడులను ప్రస్తావిస్తూ.. 2022 జనవరి 12న హత్యకు గురైన బీసీ నేత తోట చంద్రయ్య ఉదంతాన్ని లోకేష్ వివరించారు. జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పినా చంద్రయ్య లొంగలేదు, భయపడలేదని గుర్తుచేశారు. అటువంటి వీర కార్యకర్త కుటుంబాన్ని ఆదుకోవడం మన బాధ్యత అని. అందుకే ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి ప్రకటించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కోసం నిలబడిన కుటుంబాలకు అండగా ఉండాలని లోకేష్ సభా సభ్యులను కోరారు. దీనిని 2025 సెప్టెంబర్ 27న అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపామని, 100 రోజులు దాటడంతో మళ్లీ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని స్పష్టం చేశారు. చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన అసెంబ్లీకి విజ్ఞప్తి చేశారు.

Next Story