జేఈఈ మెయిన్స్ లో ఏపీ విద్యార్థుల హవా.. గర్వంగా ఉందన్న నారా లోకేశ్

by Naga Rani Yarlagadda |

జేఈఈ మెయిన్స్ పరీక్షల ఫలితాల్లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు.

జేఈఈ మెయిన్స్ లో ఏపీ విద్యార్థుల హవా.. గర్వంగా ఉందన్న నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న (సోమవారం) విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఏపీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తాచాటారు. దేశంలో 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా.. వారిలో ఏపీ నుంచి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. విజయవాడ శ్రీచైతన్య క్యాంపస్ లో చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 300/300 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. రెండోవిడత పరీక్షల తర్వాత విడుదలయ్యే ఫైనల్ ర్యాంకుల్లో మోహిత్ టాప్ ర్యాంకును సొంతం చేసుకుంటాడని అధ్యాపకులు భావిస్తున్నారు. తిరుపతికి చెందిన నరేంద్రబాబుగారి మహిత్ 100 పర్సంటైల్ సాధించడం విశేషం. ఎస్సీ కేటగిరీలో దేవ శ్రీవేద్ టాపర్ గా నిలిచాడు.

రాష్ట్రానికి చెందిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ లో అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో గర్వంగా ఉందంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా అభినందించారు. "జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణం. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర బాబు గారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచడం అభినందనీయం. కఠోర శ్రమ, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులకు హృదయపూర్వక అభినందనలు." అని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.

Next Story