‘దిగులొద్దు.. అండగా ఉంటాం’.. మంత్రి నారా లోకేష్ హామీ

by Jakkula.Mamatha |

టీడీపీలో కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు

‘దిగులొద్దు.. అండగా ఉంటాం’.. మంత్రి నారా లోకేష్ హామీ
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీలో కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్నారు కాబట్టే గత వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కార్యకర్తే అధినేత అనే మాటను శిరసావహిస్తూ.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను మంత్రి లోకేష్ నేరుగా కలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారు. వైసీపీ పాలనలో ఆ పార్టీ నాయకులు వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆర్మేనిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షును కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి మాట్లాడారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు కుమార్తెల చదువు గురించి ఆరా తీశారు. పార్టీ కోసం తాను చేపట్టిన కార్యక్రమాలను అల్లాబక్షు వివరించారు. కుమార్తెల చదువుకు సాయం అందించాలని, తన భూమిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. ఇద్దరు బిడ్డలను చదివించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. భూమి విషయంలో అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మైనార్టీ సోదరులకు నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకుంటామని, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని చెప్పారు. మంత్రి నారా లోకేష్ స్వయంగా మాట్లాడి తమకు అండగా నిలవడం పట్ల నోటమాట రావడం లేదని, ఆనందంగా ఉందని అల్లాబక్షు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అయితే.. నాలుగు దశాబ్దాలుగా అల్లాబక్షు కుటుంబం టీడీపీకి సేవలందిస్తోంది. ప్రస్తుతం మండల మైనార్టీ సెల్ అధ్యక్షునిగా అల్లాబక్షు పనిచేస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉత్తమ కార్యకర్తగా నిలిచారు. వైసీపీ దాష్టీకాలకు ఎదురొడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టారు. దీంతో తన 3.50 ఎకరాల్లో జామాయిల్ తోటను ఆ పార్టీ గూండాలు నరికివేయడం తో పాటు సదరు భూమిని కక్షతో నిషిద్ధ భూముల జాబితా 22-ఏలో చేర్చారు. తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటి గోడను కూల్చి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో అతని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని.. దిగులు చెందవద్దని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.

Next Story