జ్యూరిక్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్

by Thanuru Gopichand |

నేటి నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026 సదస్సు.

జ్యూరిక్ చేరుకున్న మంత్రి నారా లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ జనవరి 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న 56వ ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF 2026)లో పాల్గొనేందుకు జ్యూరిక్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేష్‌కు యూరప్ టీడీపి ఫోరం ప్రతినిధులు, భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, జై లోకేష్ నినాదాలతో విమానాశ్రయ ప్రాంగణం హోరెత్తింది. ఈ సందర్భంగా లోకేష్ ప్రవాసాంధ్రులతో ముచ్చటించి, రాష్ట్ర అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కీలకమని కొనియాడారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ప్రతినిధి బృందంలో భాగమైన లోకేష్.. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓలతో భేటీ కానున్నారు. ముఖ్యంగా గూగుల్ క్లౌడ్, ఐబిఎమ్ (IBM), ఎన్విడియా (NVIDIA) వంటి సాంకేతిక దిగ్గజాలతో చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఐటీ రంగం విస్తరణ, యువతకు ఉపాధి కల్పన, కృత్రిమ మేధ (AI) వంటి నూతన సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భాగంగా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దావోస్‌లోని ఏపీ పవిలియన్‌లో జరిగే పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొని రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించనున్నారు.

Next Story