మంత్రి నారా లోకేశ్ దాతృత్వంతో పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు

by Naga Rani Yarlagadda |

చిన్నారి పునర్వికకు పునర్జన్మనిచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ కదిలారు. ఆ పాపకు కావలసిన రూ.6కోట్లను సమకూర్చే బాధ్యతను తీసుకున్నారు.

మంత్రి నారా లోకేశ్ దాతృత్వంతో పునర్వికకు పునర్జన్మ.. ఎమోషనల్ అవుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: #SavePunarvika పేరుతో సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యుయెన్సర్లు చేపట్టిన ఫండ్ రైజింగ్ సూపర్ సక్సెస్ అయింది. పునర్వికకు పునర్జన్మనిచ్చేందుకు ట్రావెల్ విత్ జగదీష్, రుద్రరాజు శివ, మరికొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేపట్టిన ఈ మహాయజ్ఞం విజయవంతమైంది. SMA (Spinal muscular atrophy) డిసీజ్ తో బాధపడుతున్న 11 నెలల పాపకు రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేస్తేనే బ్రతుకుతుంది. ఆ పసిపాప బోసినవ్వులు చూసేందుకు సోషల్ మీడియా కదిలింది. ఇన్ఫ్లుయెన్సర్లు అనే పదానికి అసలైన అర్థం చెప్తూ ఊరూర చేపట్టిన విరాళాల సేకరణకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. వీరిలో ఒకరైన రుద్రరాజుశివ ఏకంగా తనచేతికి ఉన్న రూ.5 లక్షల విలువైన బంగారపు బ్రేస్ లెట్ ను ఆ పాప కోసం విరాళంగా ఇవ్వడం అందరినీ కదిలించింది. ఇక నెలకు జీతం తెచ్చుకునేవాళ్లం.. మేమే ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా రెస్పాండ్ కావాలంటూ.. మంత్రుల్ని ట్యాగ్స్ చేస్తూ నెటిజన్లు పోస్టులు, కామెంట్లు చేశారు.

తాజాగా.. పాప ట్రీట్మెంట్ పై తండ్రి సురేష్ విడుదల చేసిన వీడియోపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దాతలు ఇచ్చిన విరాళాలు, కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన రూ.50 లక్షలతో తమకు రూ.10 కోట్లు వచ్చాయని, ఇంకా రూ.6 కోట్లు అవసరం ఉంటుందని, అంత భరించే స్తోమత తమకు లేదంటూ సురేష్ వీడియోలో తెలిపారు. తనపాపను బ్రతికించుకునేందుకు చేస్తున్న ప్రయత్నంలో ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సురేష్ వీడియోపై మంత్రి నారా లోకేష్ రియాక్ట్ అయ్యారు. SMA టైప్-1 అనేది చాలా రేర్ జెనెటిక్ కండిషన్ డిసీజ్ అని, ఇది పిల్లల మజిల్స్ ను క్షీణింపజేసి, ప్రాణం తీస్తుందంటూ ట్వీట్ చేశారు. ఆ పాప జీవితాన్ని మార్చేసే రూ.16 కోట్ల ఇంజెక్షన్ కోసం వేలాదిమంది ప్రజలు రూ.10 కోట్లు విరాళాలు ఇవ్వడం తనను కదిలించిందన్నారు. విరాళాలు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నానని, ఇప్పుడు తనవంతు సహాయం అందించాల్సిన సమయం వచ్చిందన్నారు. పునర్వికకు ప్రాణాపాయం నుంచి విముక్తి కలిగించే చికిత్స కోసం కావాల్సిన మిగిలిన రూ.6 కోట్లను అందించే బాధ్యతను ఇప్పుడు నేను తీసుకుంటున్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఈ విషయంలో సమన్వయం చేయవలసిన బాధ్యతలను తన ఆఫీస్ టీమ్ కు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ బిడ్డ అయిన ఈ ధైర్యవంతురాలి చికిత్స కోసం అందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ చిన్నారి పూర్తిగా ఆరోగ్యవంతురాలు అయ్యేందుకు అవసరమయ్యే అన్ని చర్యలూ తీసుకోవలసిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.

Next Story