ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్.. విజయవాడలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు

by Naga Rani Yarlagadda |

ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) శుక్రవారం విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్.. విజయవాడలో మంత్రి నాదెండ్ల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Minister Nadendla Manohar) శుక్రవారం విజయవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గొల్లపూడి అగ్రికల్చర్ మార్కెట్‌లోని సివిల్ సప్లై గోడౌన్‌తో పాటు, గన్నవరం గోడౌన్‌ను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. పౌర సరఫరాల వ్యవస్థలో పారదర్శకత, నిబంధనల అమలు, ప్రజలకు నాణ్యమైన రేషన్‌ సరఫరా చేయడమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యా సంవత్సరం నుంచి 41,091 పాఠశాలలు, 3,800 సంక్షేమ హాస్టళ్లకు మధ్యాహ్న భోజన పథకం కింద 25 కిలోల బస్తాల్లో బియ్యం పంపిణీ జరుగుతోందన్నారు. ఈ ప్రక్రియలో మరింత పారదర్శకత కోసం ప్రతి బస్తాపై QR కోడ్ ముద్రిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి దీనిపై మంచి స్పందన లభించిందని వెల్లడించారు. విజయవాడ ఎం.ఎల్.ఎస్ పాయింట్ ద్వారా 378 రేషన్ దుకాణాలకు, గన్నవరం గోడౌన్ నుంచి 103 రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా జరుగుతోందని తెలిపారు. తనిఖీల సమయంలో బియ్యం బస్తాల ప్యాకింగ్‌, బఫర్ గోడౌన్ నుంచి వచ్చిన స్టాక్ వివరాలు, QR కోడ్‌లు తన మొబైల్‌ ద్వారా స్కాన్ చేసి పరిశీలించారు. హమాలీ కూలీలతో మాట్లాడి సరఫరాలో ఇబ్బందులపై సమీక్ష చేశారు.

బియ్యం నాణ్యత, తూకం, ఆయిల్ ప్యాకెట్లను స్వయంగా తనిఖీ చేసిన మంత్రి, గత మూడు నెలల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించగా కొన్ని డీలర్ల వద్ద ఓపెనింగ్, క్లోజింగ్ స్టాక్‌లలో వ్యత్యాసం కనిపించిందన్నారు. విజయవాడ రైస్ గోడౌన్ నుంచి బియ్యం తీసుకుంటున్న నలుగురు డీలర్ల వద్ద అనియమాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏలూరు రోడ్డులోని ఒక రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, డీలర్ లేకపోవడం, స్టాక్ లేకపోవడం, అవసరమైన సమాచారం పోస్టర్లు గోడపై లేకపోవడం minister తీవ్రంగా పరిగణించారు. ఇకపై ప్రతి చౌక ధరల దుకాణంలో స్టాక్ వివరాలు, అధికారుల సమాచారం, అభిప్రాయాల కోసం QR కోడ్ స్కానర్‌తో కూడిన పోస్టర్ తప్పనిసరిగా ఉండాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

మా ప్రభుత్వ లక్ష్యం – పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల సౌకర్యమేనని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ప్రతినెలా 25వ తేదీ నుంచి 30 వరకు ఇంటికే రేషన్ సరఫరా చేసే ప్రత్యేక ఏర్పాట్లు అమలులో ఉన్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల పునరావృతం కాకుండా, ఈ ప్రభుత్వం పకడ్బందీ తనిఖీలతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Next Story