క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశ మంత్రి మండిపల్లి అడుగులు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-30 07:55:39  IST  )

ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవతో ప్రత్యేక భేటీ.

క్రీడా రంగాన్ని బలోపేతం చేసే దిశ మంత్రి మండిపల్లి అడుగులు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని (Sports) బలోపేతం చేసే దిశగా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కీలక అడుగులు వేశారు. దిల్లో పర్యటనలో భాగంగా ఆయన ఖేలో ఇండియా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మయాంక్ శ్రీవాస్తవతో (Mayank Srivastava) ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన ఖేలో ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) మద్దతును మంత్రి కోరారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు ‘అస్మిత’ పథకం అమలుపై లోతుగా చర్చించారు. ప్రతి జిల్లాలో మహిళల కోసం ప్రత్యేకంగా అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించాలని ప్రతిపాదించారు. తద్వారా క్రీడల పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. యువతలో ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెంచేందుకు ప్రతి ఆదివారం ‘సండే ఆన్ సైకిల్’ పేరుతో ఫిట్‌నెస్ కార్నివాల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా క్రీడా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు కోచ్‌ల సంఖ్యను పెంచడం, క్రీడా బడ్జెట్‌ను గణనీయంగా పెంచడంపై కేంద్ర అధికారులతో మంత్రి చర్చలు జరిపారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎస్‌ఏఐ నిధులతో క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించాలని కోరారు. మంత్రి ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మయాంక్ శ్రీవాస్తవ, ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధికి కేంద్రం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. త్వరలోనే ఎస్‌ఏఐ ఉన్నతాధికారుల బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తుందని స్పష్టం చేశారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రం క్రీడా విప్లవానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. యువత ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story