నమో అంటే నాయుడు.. మోదీ : మంత్రి నారా లోకేష్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-28 08:43:52  IST  )

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.

నమో అంటే నాయుడు.. మోదీ : మంత్రి నారా లోకేష్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విద్య, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సీతపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.2300 కోట్ల పెట్టుబడితో బ్లూజెట్ హెల్త్ కేర్ అభివృద్ధి పనులు దశలవారీగా జరగనున్నాయి. మండలంలోని ఇండస్ట్రియల్ పార్కులోనే యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. 2028-29 ఆర్థిక ఏడాదిలో బ్లూజెట్ హెల్త్ కేర్ కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ సంస్థ ద్వారా ప్రత్యేక్షంగా, పరోక్షంగా సుమారు 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం 102.48 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.

ఏపీలో నమో అంటే..

ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి బ్లూజెట్ హెల్త్ కేర్ సంస్థరావడం శుభసూచికంగా పేర్కొన్నారు. కొత్త కంపెనీల రాకతో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పనకు ఇదే నిదర్శనమని తెలిపారు. ఏపీలో నడుస్తున్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని, డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్రమోదీ అని అందరికీ తెలిసిన విషయమేనని, కానీ ఏపీలో నమో అంటే.. నాయుడు, మోదీ అని అంటారన్నారు. కేంద్రంలో మోదీ, ఏపీలో చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. కొత్త కంపెనీలకు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలకు కొదువలేదని లోకేష్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు వచ్చిన వారికి అన్ని వసతులను సమయానుకూలంగా అందిస్తున్నామని తెలిపారు. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

Next Story