మా రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టండి: CIBCని కోరిన మంత్రి లోకేశ్

by Vemula.Srinu Prasad |

మా రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టండి: CIBCని కోరిన మంత్రి లోకేశ్

మా రాష్ట్రంలో పెట్టుబుడులు పెట్టండి: CIBCని కోరిన మంత్రి లోకేశ్
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా కెనడాలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) పర్యటన కొనసాగుతోంది. ఈ రోజు కెనడా – ఇండియా బిజినెస్ కౌన్సిల్ (CIBC) ప్రెసిడెంట్ విక్టర్ థామస్‌(Victor Thomas)తో ఆయన మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ ఎఐ, క్వాంటమ్ వంటి భవిష్యత్ సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, తూర్పుతీరంలో భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఆయన వివరించారు. ఇటీవల గూగుల్ సంస్థ విశాఖపట్నంలో ఎఐ హబ్, డాటా సెంటర్‌పై $15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిందని తెలిపారు. ఇది భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్‌డీఐ‌గా ఉందని, సెమీ కండక్టర్స్, ఐటి, ఎలక్ట్రానిక్స్, డాటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు ఏపీలో అత్యుత్తమ ప్రోత్సాహకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. అమరావతి రాజధానిలో రూ.65వేలకోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. విమానాశ్రమయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టేందుకు కెనడియన్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిందిగా లోకేశ్ విజ్ఞప్తిచేశారు.

సిఐబిసి ప్రెసిడెంట్ విక్టర్ థామస్(CIBC President Victor Thomas) మాట్లాడుతూ కెనడా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (C-IBC) ఇరుదేశాల నడుమ వాణిజ్యం, పెట్టుబడులను పెంచడం, భాగస్వామ్యాలను సులభతరం చేసేందుకు వారధిగా పనిచేస్తుందని తెలిపారు. ఆర్థిక, సాంకేతికత, విద్యుత్, వ్యవసాయం తదితర రంగాల్లో మార్కెట్ లీడర్లను గుర్తించి నెట్‌వర్కింగ్ ద్వారా ప్రభుత్వాలకు సలహా ఇవ్వడంపై దృష్టి సారిస్తుందన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక కారిడార్‌ను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. ఉన్నత స్థాయి ఫోరమ్‌లు, వ్యాపార మిషన్‌లు, నిపుణులతో రౌండ్‌టేబుల్స్ సమావేశాలు నిర్వహించి ఇరుదేశాల్లో ఉన్న అవకాశాలను వివరిస్తామని చెప్పారు. ముఖ్యంగా SMEలకు భారతీయ మార్కెట్‌లో పెరుగుతున్న అవకాశాలను నావిగేట్ చేయడంలో సహకరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికాభివృద్ధికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని విక్టర్ థామస్ పేర్కొన్నారు.

Next Story