ఒకటైనా నిరూపించండి: జగన్‌కు మంత్రి సంచలన సవాల్

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారంపై సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కుట్రలు బట్టబయలైన‌ట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ..

ఒకటైనా నిరూపించండి: జగన్‌కు మంత్రి సంచలన సవాల్
X

దిశ‌, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కల్తీ మద్యం వ్యవహారంపై సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల కుట్రలు బట్టబయలైన‌ట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, రాష్ట్రంలో అలజడులు సృష్టించడం లక్ష్యంగా వైసీపీ నేతలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆయన తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొల్లు ర‌వీంద్ర‌ మాట్లాడుతూ మొలకలచెరువు, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో కల్తీ మద్యం తయారీ, అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రధాన నిందితుడిగా తేలినట్లు తెలిపారు. ఈ కుట్రలో అద్దేపల్లి జనార్ధన్, జగన్మోహన్ తదితర వైసీపీ నేతల పాత్రపై విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాయని చెప్పారు. గతంలో సొంత బాబాయి హత్య కేసులో కూడా రాజకీయ కుట్రలు పన్నారని ఆరోపించిన మంత్రి, ఇప్పుడు అదే తరహాలో కల్తీ మద్యం వ్యవహారాన్ని ఉపయోగించి కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాజకీయ లాభం పొందాలనే దురుద్దేశంతోనే ఈ కుట్రలు జరుగుతున్నాయని ఆయ‌న ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో నాసిరకం మద్యం బ్రాండ్లు, హానికర రసాయనాలతో కూడిన మద్యం విక్రయాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది కిడ్నీ, లివర్, బ్రెయిన్ సంబంధిత వ్యాధులతో బాధపడ్డారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆ కాలంలో మద్యం విధానాన్ని పూర్తిగా అవినీతికి వేదికగా మార్చి భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని ఆయ‌న‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పారదర్శకమైన మద్యం విధానాన్ని అమలు చేస్తోందని, డిస్టిలరీ నుంచి దుకాణం వరకు ప్రతి బాటిల్‌ను డిజిటల్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని ఆయ‌న‌ తెలిపారు. “రాష్ట్రంలో ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం” అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక్క కల్తీ బాటిల్ అయినా చూపించి నిరూపించాలని మంత్రి సవాల్ విసిరారు.

‘ఎక్సైజ్ సురక్ష’ యాప్ ద్వారా ప్రజలు మద్యం బాటిల్ నాణ్యతను స్వయంగా తనిఖీ చేసుకునే అవకాశం కల్పించామని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రముఖ నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో బ్రాండ్ల కొరత సృష్టించి పొరుగు రాష్ట్రాల నుంచి నాసిరకం మద్యం తెప్పించారని ఆరోపించారు. కల్తీ మద్యం నెట్‌వర్క్ ఐదు రాష్ట్రాలకు విస్తరించిందని, లేబుళ్ల ముద్రణ నుంచి మూతల తయారీ, సరఫరా వరకు పెద్ద ఎత్తున వ్యవస్థ పనిచేసిందని తెలిపారు. ఈ అక్రమాలకు ప్రభుత్వ ఆర్టీసీ బస్సులను కూడా వినియోగించారని ఆరోపించారు. రాష్ట్రంలో కుల, మత విభేదాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని మంత్రి ఆరోపించారు. ప్రజల ప్రాణాలు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కల్తీ మద్యం కేసులో భాగమైన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story