స్వామి వారి పటాలను అలా చూసి నిశ్చేష్టులమయ్యాం: మంత్రి దుర్గేష్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-02-21 11:05:54  IST  )

అత్యున్నత చట్టసభ అయిన శాసన మండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి చిత్రపటానికి చేసిన అపచారాన్ని ప్రజలందరికీ తెలియజేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

స్వామి వారి పటాలను అలా చూసి నిశ్చేష్టులమయ్యాం: మంత్రి దుర్గేష్
X

దిశ, వెబ్ డెస్క్: అత్యున్నత చట్టసభ అయిన శాసన మండలిలో వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి చిత్రపటానికి(YCP leaders Venkateswara Swamy) చేసిన అపచారాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని మంత్రి కందుల దుర్గేష్(Minister Kandula Durgesh) పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు, కూటమి నేతలతో కలిసి ఆయన మాట్లాడారు. ఇప్పుడు కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో ఈ తరహా ఘటనలు ఏ దేవుడి విషయంలో అయినా, ఏ మతం విషయంలో అయినా జరిగే అవకాశముందని మంత్రి దుర్గేష్ అన్నారు. సమాజంలో బాధ్యతాయుతమై స్థాయిలో ఉన్న మనమంతా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తరపున ఒక బిల్లు ప్రవేశపెట్టే సమయంలో వైసీపీ సభ్యులు పోడియం వద్దకు వచ్చి బూట్లు, చెప్పులు వేసుకుని మరీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను పట్టుకున్నారని మంత్రి దుర్గేష్ వివరించారు.

"పవిత్రమైన దేవుడి పటాలను గాలిలో ఊపుతూ, ఆ తర్వాత వాటిని నిర్లక్ష్యంగా కిందకు విసిరివేయడం చూసి మేము నిశ్చేష్టులమయ్యాం. ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే చర్య" అని ఆయన మండిపడ్డారు. ఈ ఘటన యాదృచ్ఛికం కాదు, ముమ్మాటికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లోనే జరిగింది. గతంలో తిరుమల డిక్లరేషన్‌పై సంతకం చేయకపోవడం, లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం వంటి ఘటనలే దీనికి నిదర్శనమని స్పష్టం చేశారు. అంతే కాదు నాడు వారి హయాంలో ఇష్టం లేని వ్యక్తులను జైల్లో పెట్టించడం, వినతి పత్రాలు ఇవ్వడానికి ఆఫీసుకు వెళ్తే హౌస్ అరెస్ట్‌లు చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, తప్పు లేకపోయినా ఏదో ఒక రకమైన కేసు బనాయించి ఇబ్బందులు పెట్టడం తదితర అప్రజాస్వామిక కార్యక్రమాలే మొదటి నుండి వైసీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. వీటన్నింటిని వల్లే జగన్ ఒక నియంతగా పేరు తెచ్చుకున్నారని వివరించారు. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ సభ్యులు బూట్లతో కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి చిత్ర పటాలు పట్టుకున్నారన్న ఆధారాలు స్పష్టంగా ఉన్నా, సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణ వంటి నేతలు వితండవాదం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. అదే విధంగా తిరుమల శ్రీవారికి సతీసమేతంగా పట్టువస్త్రాల సమర్పణకు వెళ్లకుండా ఒక్కడే వెళ్తారని, తిరుమలలో గోవింద నామ స్మరణనే మారుమ్రోగాలన్న నిబంధనను ఉల్లంఘించి సాక్ష్యాత్తు వారి పిన్నితో జగన్ రక్షకా గోవింద అనిపించుకున్న దుర్మార్గాన్ని చూసామని మంత్రి దుర్గేష్ ఫైర్ అయ్యారు. వైసీపీకి ఏ రకమైన నమ్మకాలు లేవు. ఏదో రకంగా గలాట చేయడం పరిపాటి అయింది.. భగవంతుణ్ణి కించపరచమని జగన్ ఇచ్చిన ప్రోత్సాహమని స్పష్టమవుతోందన్నారు. జగన్‌కు ఎదుటివారిని గౌరవించే మనస్తత్వం లేదని మరోమారు స్పష్టమైందన్నారు.

ఈ క్రమంలో వైసీపీ అనుసరిస్తున్న ఇటువంటి మతవిద్వేష, అప్రజాస్వామిక విధానాలను ఎండగట్టేందుకు కూటమి పక్షాన వారం రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తులు అన్ని మతాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని, కానీ వైసీపీ నేతలకు ప్రజాస్వామ్య విలువల పట్ల కనీస గౌరవం లేదని మంత్రి దుర్గేష్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు.. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాల్సిన బాధ్యత తమపై ఉంటుందన్నారు. సమాజమంతా కలిసి ఈ తరహా విధానాలను ఖండించాలని, నిర్దిష్టమైన ఆలోచన చేయకపోతే భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారే అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ దిశానిర్దేశం చేశారు. భారతీయ సమాజంలో ఉండే వారికి పరమత సహనం ఉంది.. అది కోల్పోయే ప్రమాదం వస్తే ఎవరూ ఉపేక్షించవద్దన్నారు. సమాజంలో ఇటువంటి పోకడలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సమాజంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉన్న మీడియా ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని మంత్రి దుర్గేష్ కోరారు.

Next Story