9 ఏళ్ల తర్వాత మంత్రి నోట.. నంది అవార్డుల మాట

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-07 07:03:17  IST  )

చలనచిత్ర, టీవీ, నాటకరంగాల కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులపై ఏపీ మంత్రి కంద్రుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు.

9 ఏళ్ల తర్వాత మంత్రి నోట.. నంది అవార్డుల మాట
X

దిశ, వెబ్‌డెస్క్: చలనచిత్ర, టీవీ, నాటకరంగాల కళాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక నంది అవార్డులపై ఏపీ మంత్రి కంద్రుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలోనే నంది అవార్డులను అందజేస్తామని స్పష్టం చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నంది అవార్డులపై అప్డేట్ ఇచ్చారు. 2017లో 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించిన నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం అందించింది. ఆ తర్వాతి కాలంలో ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. అప్పుడున్న నంది అవార్డులనే కంటిన్యూ చేయాలా ? లేక ఏమైనా మార్పులు చేయాలా ? అన్నవాటిపై పూర్తిస్థాయిలో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణ నుంచి నంది అవార్డులపై సలహాలు తీసుకోనున్నామన్నారు. రెండు, మూడు నెలల్లోనే రాష్ట్రంలో నంది అవార్డుల వేడుక నిర్వహిస్తామన్నారు. అలాగే నంది నాటకోత్సవాలను కూడా నిర్వహిస్తామన్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన వేదికను ప్రకటిస్తామన్నారు. కాగా.. ఈసారి అవార్డులను 9 సంవత్సరాల్లో వచ్చిన సినిమాలు, నటీనటులకు కలిపి ఇస్తారా? ఎలా ప్లాన్ చేస్తున్నారన్న వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా , రంగస్థలం, టెలివిజన్‌లో అత్యుత్తమ ప్రతిభను, అలాగే భారతీయ సినిమాలో జీవితకాల విజయాలను గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వార్షిక అవార్డులే నంది అవార్డులు. 2017లో నిర్వహించిన నంది అవార్డుల వేడుకలో 2014 ఉత్తమ చిత్రంగా లెజెండ్, ఉత్తమ నటుడిగా బాలకృష్ణ అవార్డులు అందుకున్నారు. అలాగే 2015లో ఉత్తమ చిత్రంగా బాహుబలి (ది బిగినింగ్), ఉత్తమ నటుడిగా మహేశ్ బాబు (శ్రీమంతుడు), 2016లో ఉత్తమ చిత్రంగా పెళ్లి చూపులు, ఉత్తమ నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో) నంది అవార్డులు అందుకున్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి వైఎస్సార్సీపీ నంది అవార్డులను నిలిపివేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ అవార్డులను మళ్లీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు తెలంగాణ సర్కార్.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డ్స్ ను ఇస్తోంది. ఈ ఏడాది ఉగాది రోజున గద్దర్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.

టాలీవుడ్‌లో హయ్యెస్ట్ నంది అవార్డులు గెలుచుకున్న హీరో.. అస్సలు ఊహించి ఉండరేమో!

Next Story