అందుకు ఎన్టీ రామారావే ఆద్యుడు: మంత్రి గొట్టిపాటి సంచలన వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-19 13:19:42  IST  )

రాష్ట్రంలో అమలవుతున్న చాలా సంక్షేమ పథకాలకు ఎన్టీ రామారావునే ఆద్యుడు అని మంత్రి గొట్టిపాటి తెలిపారు..

అందుకు ఎన్టీ రామారావే ఆద్యుడు: మంత్రి గొట్టిపాటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్ర‌స్తుతం అమ‌లవుతున్న చాలా సంక్షేమ ప‌థ‌కాల‌కు దివంగత మాజీ సీఎం ఎన్టీ రామారావు(Former Cm Nt Ramarao) ఆద్యుడ‌ని మంత్రి గొట్టిపాటి ర‌వి కుమార్(Minister Gottipati Ravi Kumar) స్పష్టం చేశారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో పర్యటించిన ఆయన వ‌రి అన్నం తినే ప‌రిస్థితులు లేని రోజుల్లో పేద‌వాడు కూడా సంతృప్తిగా భోజ‌నం చేయాల‌నే ఆలోచ‌న‌తో కిలో బియ్యం రెండు రూపాయిలకు ప‌థ‌కాన్ని ఎన్టీ రామారావు ప్రారంభించార‌ని తెలిపారు. అలాగే ఎన్టీఆర్ ప్ర‌వేశ పెట్టిన మ‌హిళ‌ల‌కు ఆస్తిలో స‌మాన హ‌క్కు, పేద‌ల‌కు ప‌క్కా ఇళ్లు, విద్యార్థుల‌కు గురుకుల పాఠ‌శాల‌లు వంటి ప‌థ‌కాలు చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచి పోయాయ‌ని గుర్తు చేశారు. తెలుగోడి ఆత్మ గౌర‌వం కోసమే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే, సీఎం చంద్ర‌బాబు నాయుడు(CM Chandrababu Naidu) తెలుగు వారి కీర్తిని ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లార‌ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) కొనియాడారు.

ఉద్యోగాలు రావాల‌నే త‌ప‌న‌తోనే...

రాష్ట్ర యువ‌త‌కు ఇక్క‌డే ఉద్యోగాలు రావాల‌నే త‌ప‌న‌తోనే ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు, పెట్టుబ‌డుల కోసం సీఎం చంద్ర‌బాబు ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి తెలిపారు. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని గుడిపాడు, కుంద‌ర్తి గ్రామాల ప‌రిధిలో రైతుల స‌హ‌కారంతో వెయ్యి ఎక‌రాలు తీసుకుని విండ్ ఎన‌ర్జీ మానిఫ్యాక్చ‌రింగ్ హ‌బ్ తో పాటు సోలార్ ప్యానల్ త‌యారీ ప‌రిశ్ర‌మ‌ల‌ను ఏర్పాటుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇటువంటి పెద్ద ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు అయితే అద్దంకి ప‌రిస‌ర ప్రాంతాల యువ‌త‌కు కొంత‌మేర ఉద్యోగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మంత్రి చెప్పారు. అద్దంకిని ప్ర‌కాశం జిల్లాలో క‌ల‌ప‌డంతో పాటు అద్దంకి రెవిన్యూ డివిజ‌న్ ఏర్పాటు కూడా సీఎం చంద్ర‌బాబు వ‌ల్లే జ‌రిగింద‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

Next Story