అధికారంలోకి వచ్చేది లేదు..చూసేది లేదు: వైసీపీపై మంత్రి జనార్దన్ రెడ్డి సెటైర్స్

by Vemula.Srinu Prasad |

మళ్లీ వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చేది లేదని, తాము చూసేది లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సెటైర్లు వేశారు...

అధికారంలోకి వచ్చేది లేదు..చూసేది లేదు: వైసీపీపై మంత్రి జనార్దన్ రెడ్డి సెటైర్స్
X

దిశ, వెబ్ డెస్క్: మళ్లీ వైసీపీ(Ycp) నేతలు అధికారంలోకి వచ్చేది లేదని, తాము చూసేది లేదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి(Minister BC Janardhan Reddy) సెటైర్లు వేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే.. టీడీపీ(Tdp) సంగతి చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితి లేదన్నారు. నోటికొచ్చినట్లు విమర్శలు చేసి బట్ట కాల్చి ముఖం మీద వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసిపి నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని ప్రశ్నించారు. రాయలసీమ సమస్యలపై మాట్లాడమంటే ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. రాయలసీమ(Rayalaseema)ను అభివృద్ధి చేసినా, నీళ్లు ఇచ్చిన ఆ ఘనత టిడిపి, చంద్రబాబు(Chandrababu)దేనన్నారు. ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)ను గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. నేడు గ్రామాల్లో రెచ్చగొట్టే ధోరణితో వైసిపి శ్రేణులు వ్యవహరిస్తున్నాయని, అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ సంయమనం పాటిస్తుందని తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకు తింటే నేడు తాము అభివృద్ధి బాట పట్టిస్తున్నామని పేర్కొన్నారు. నాడు మీరు గ్రామాల్ని భ్రష్టు పట్టిస్తే, నేడు సిసి రోడ్లతో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.

సమన్వయంతో ప్రభుత్వం...

‘‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో సాగుతుంది. కూటమి పాలనలో ప్రజలకు సంక్షేమ - అభివృద్ధి పాలన అందిస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి సూపర్ సిక్స్ లో భాగంగా ప్రతి హామీ అమలు చేస్తున్నాం. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలకు ఉంది. ప్రజలు కూటమి పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడంతో మన బాధ్యత మరింత పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నేతలు అంతా ఒక్కటే సత్తా చాటాలి. వైసీపీ నేతలు స్థాయికి మించి సిగ్గు శరం లేకుండా విమర్శలు చేస్తున్నారు. గత ఐదు ఏళ్ళు వైసిపి చేసిన పాపాలు నేడు వారి పాలిట శాపాలుగా మారుతున్నాయి. గతంలో వారు వేధింపులకు పాల్పడిన మేము ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు అండగా నిలవాల్సిన బాధ్యత నూతన కార్యవర్గంపై ఉంది.’ అని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సూచించారు.

Next Story