‘వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు’.. మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 08:07:23  IST  )

టీడీపీ మహానాడు కార్యక్రమం ఇవాళ(మంగళవారం) కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతుంది.

‘వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు’.. మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు కార్యక్రమం ఇవాళ(మంగళవారం) కడప జిల్లాలో అట్టహాసంగా జరుగుతుంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు పండుగ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. టీడీపీ మహానాడు కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ క్రమంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం, విశ్వాసానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. తెలుగు ప్రజల అభివృద్ధిలో పార్టీకి విడదీయరాని అనుబంధం ఉంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ విదేశాల్లో చాటిచెప్పిన మహనీయుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జెండా.. తెలుగు జాతికి అండ అని మంత్రి తెలిపారు. తెలుగు ప్రజల కోసం, తెలుగు రాష్ట్రాల ప్రగతి కోసం టీడీపీ కృషి చేస్తుంది. పౌరుషాల గడ్డ కడపలో పసుపు జెండా సత్తా చూపించేందుకు తెలుగు దండు కదం తొక్కింది అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

టీడీపీ చారిత్రాత్మక మహానాడు తొలిసారి మన కడపలో ఘనంగా జరుగుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత నారా లోకేష్ పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉంటారని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. వైసీపీ భూస్థాపితం అయిపోయిన పార్టీ అని మంత్రి అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. మద్యం, ఇసుక, మైనింగ్ కుంభకోణాలతో మాజీ సీఎం జగన్ అండ్ కో టీమ్ ప్రజా సంపద దోచుకుంది అని విమర్శించారు. ఈ తరుణంలో వస్తున్నా మీ కోసం అని నాడు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఎప్పుడైన సీఎం చంద్రబాబు ప్రజలకు అండగా ఉంటారని తెలిపారు. యువగళం పేరుతో తెలుగు ప్రజలకు నారా లోకేష్ అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు.

Next Story