వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం : మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |

వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం లేదా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన చనిపోయిన రోజు జగన్ ఎక్కడున్నారని నిలదీశారు.

వైఎస్సార్ మరణం వెనుక జగన్ హస్తం : మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన సమయంలో జగన్ ప్రవర్తనపై ఆయన పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు, జగన్ వైఖరిని తప్పుబడుతూ పలు ప్రశ్నలు సంధించారు. వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ ఎక్కడ ఉన్నారు? రాష్ట్రమంతా తన తండ్రి కనిపించడం లేదని ఆందోళన చెందుతుంటే, జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. వైఎస్ఆర్ మరణవార్త విని తెలుగు ప్రజలంతా శోకసంద్రంలో మునిగిపోతే, జగన్ మాత్రం అప్పుడే సీఎం పదవి కోసం సంతకాలు సేకరించడం ఆయన అధికార దాహానికి నిదర్శనమని విమర్శించారు.

బొత్స వ్యాఖ్యల ప్రస్తావన

వైఎస్ఆర్ మృతి వెనుక జగన్ హస్తం ఉందనే అనుమానాన్ని గతంలో బొత్స సత్యనారాయణే వ్యక్తం చేశారని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ఐదేళ్ల పాలనలో జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని, తెలుగు ప్రజలపై ఆయనకు ఎందుకంత కక్ష అని నిలదీశారు. తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ఈ విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

Next Story