యూరియా నిల్వలపై మంత్రి అచ్చెన్న సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో నెలకొన్న యూరియా కొరత పరిస్థితులపై మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

యూరియా నిల్వలపై మంత్రి అచ్చెన్న సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పంట వేసేందుకు సరైన మోతాదులో యూరియా (Urea Crisis) దొరకకపోవడంతో రైతులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు (Minister Atchennaidu) ఉమ్మడి కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, కడప, బాపట్ల, ఏలూరు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. యూరియా కొరత కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్లు దృష్టి సారించి, సమస్యలకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. అలాగే ప్రస్తుతం అధికారికంగా ఉన్న యూరియా లెక్కలకు, గ్రౌండ్ లెవల్లో ఉన్న నిల్వలకు ఉన్న తేడాను పర్యవేక్షించి, జిల్లాల వారిగా ఉన్న యూరియా నిల్వలకు సంబంధించిన వివరాలను వెంటనే అందజేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల్లో పేర్కొన్నారు.

అలాగే గంగవరం, కాకినాడ పోర్టుల నుంచి రావలసిన 53 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరుకునేలా పోర్టు, రైల్వే అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కృష్ణా, బాపట్ల, కడప జిల్లాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉందన్న మంత్రి.. ఆయా జిల్లాల కలెక్టర్లు దీనిపై స్పందించి రైతుల సమస్యల్ని పరిష్కరించేలా చూడాలని తెలిపారు. కాగా.. రాష్ట్రంలో భవిష్యత్ అవసరాల నిమిత్తం కేంద్రం తొమ్మిదిన్నర లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు.

Next Story