నా అన్న మహానేత ... భావోద్వేగానికి గురైన అచ్చెన్న

by Vemula.Srinu Prasad |

ప్రజాసేవను ప్రాణంగా భావించిన మహోన్నత నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు తనకు దిక్సూచి మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు...

నా అన్న మహానేత ... భావోద్వేగానికి గురైన అచ్చెన్న
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాసేవను ప్రాణంగా భావించిన మహోన్నత నాయకుడు కింజరాపు ఎర్రన్నాయుడు తనకు అన్నయ్యగానే కాదని, మార్గదర్శకుడిగా, జీవితానికి దిక్సూచిగా నిలిచారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం దివంగత నేత కింజ‌రాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో కలసి ఎర్రన్నాయుడు విగ్రహానికి మంత్రి అచ్చెన్నాయుడు ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడిన ఆయన అడుగుజాడల్లో నడవడం తనకు గర్వకారణమని, అలాంటి మహానేతకు తమ్ముడిగా పుట్టడం తన జీవితంలో అత్యంత అదృష్టమని భావోద్వేగంతో పేర్కొన్నారు. ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజాహితం పట్ల అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆయన ఆశయ సాధనకే తన ప్రతి శ్వాస అంకితం చేస్తానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎర్రన్నాయుడు నాయకత్వంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు. గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతులు, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, ఆరోగ్య రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపడంలో ఆయన ప్రత్యేక శైలి ఉండేదని గుర్తుచేశారు. ఢిల్లీలో ఉత్తరాంధ్ర స్వరంగా అభివృద్ధి కోసం ఎర్రన్నాయుడు గళం విప్పారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగాలనే దృఢ సంకల్పంతో ఆయన పోరాడారని చెప్పారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలోనూ ప్రజా సంక్షేమాన్ని ముందుంచుకుని నిర్ణయాలు తీసుకున్న నాయకుడని కొనియాడారు.

యువ‌త రాజకీయాల్లోకి వ‌చ్చేందుకు స్ఫూర్తి నిచ్చిన మహానేత

ఎర్రన్నాయుడు నాయకత్వం స్ఫూర్తిగా తీసుకుని ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలనే తపన, నిబద్ధత, నిజాయితీ ఆయన వ్యక్తిత్వంలో అంతర్లీనంగా ఉన్నాయని చెప్పారు. ఆయన చూపిన మార్గం ఈ తరానికి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళం ముద్దుబిడ్డగా గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నార‌ని తెలిపారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లా ఒక కొత్త దిశలో ముందుకెళ్లింది. అభివృద్ధి అంటే ఏమిటో, ప్రజాసేవ అంటే ఏమిటో తన జీవితంతో చూపించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ప్రజల సంక్షేమం కోసం, రైతాంగం కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు అని అన్నారు. రైతులకు సాగునీరు అందించాలనే తపనతో అహర్నిశలు శ్రమించారు.

Next Story