- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర నిర్ణయంపై మంత్రి అచ్చెన్నాయుడు హర్షం
పొగాకు రైతులకు మేలు చేసేలా ముడి పొగాకుపై ఎక్సైజ్ సుంకం రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకున్న ఓ నిర్ణయం పొగాకు రైతుల పాటిన వరంగా మారనుంది. ముడి పొగాకు (RAW Tobacco) ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పొగాకు పండించే రైతులకు మేలు జరగనుంది. ఈ క్రమంలో రైతాంగంతో పాటు వివిధ వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (kinjarapu Atchannaidu) కూడా సానుకూలంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంతో పాటు కేంద్రంలో ఎన్డీఏ (NDA) భాగస్వామి పక్ష నేతగా తన సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు, నిర్ణయాల ఫలాలు ప్రజలకు దక్కేలా చేస్తుందని.. ఈ నిర్ణయం రాష్ట్రంలో అమలుకానున్న విధానమే అందుకు నిదర్శనంగా నిలుస్తుందని ఆయా పార్టీల నేతలు అంటున్నారు.
అయితే కేంద్ర ప్రభుత్వం ముడి పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం అమరావతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పొగాకు సాగు చేసే రైతులతోపాటు (Farmers) చిరువ్యాపారులకు (Small Vendors) ఒక వరమని కొనియాడారు. ప్రధానంగా అన్‌బ్రాండెడ్ (Un Branded) ముడి పొగాకు విక్రయాలపై సున్నా ఎక్సైజ్ డ్యూటీ విధిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముడి పొగాకును బల్క్‌గా సంచుల్లో విక్రయించే రైతులకు ఇకపై ఎలాంటి పన్ను భారం ఉండదని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గతంలో పన్నుల విషయంలో ఉన్న అస్పష్టత వల్ల రైతులు ఇబ్బందులు పడేవారని పేర్కొన్నారు. అయితే కొత్త గెజిట్‌తో పారదర్శకత పెరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఈ సవరణ వల్ల మార్కెట్‌లో ముడి పొగాకుకు మెరుగైన ధర లభించే అవకాశం ఉందన్నారు. తద్వారా సామాన్య రైతు ఆర్థికంగా బలోపేతం అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా ముడి పొగాకు సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని మంత్రి వివరించారు. అన్‌బ్రాండెడ్ ఉత్పత్తులకు మినహాయింపు ఇవ్వడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ ఎగవేతలకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పన్ను విధానం సరళతరం కావడం వల్ల క్షేత్రస్థాయిలో వ్యాపార లావాదేవీలు మరింత సులభతరం అవుతాయని, ఇది చిరువ్యాపారులకు పెద్ద ఊరటనిస్తుందని తెలిపారు.
బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో జరిగే దుర్వినియోగానికి ఈ నూతన విధానం చెక్ పెడుతుందని మంత్రి పేర్కొన్నారు. ముడి పొగాకు విక్రయాలను క్రమబద్ధీకరించడం ద్వారా అసలైన లబ్ధిదారులకు న్యాయం జరుగుతుందని మంత్రి అన్నారు. పన్నుల పరిధి నుంచి ముడి పొగాకును మినహాయించడం వల్ల వ్యవస్థలో ఉన్న అవకతవకలు తగ్గుముఖం పడతాయని, ఇది పరిశ్రమకు దీర్ఘకాలిక ప్రయోజనాలను చేకూరుస్తుందని వివరించారు.
చివరగా రైతుల పక్షపాతిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయం పొగాకు రంగంలో నూతన ఉత్తేజాన్ని నింపుతుందని మంత్రి అచ్చెన్నాయుడు కుండబద్ధలుగొట్టారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, కేంద్రం నుంచి ఇలాంటి మరిన్ని ప్రోత్సాహకాలను ఆశిస్తున్నామని ఆయన సానుకూలతను ప్రకటించారు.






