ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు

by Thanuru Gopichand |

రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం.

ఉల్లి రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ, వెబ్ డెస్క్ : కర్నూలు జిల్లాలోని కోడుమూరులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) శనివారం పర్యటించారు. తన పర్యటన సందర్భంగా ఉల్లి రైతులకు (Onion Farmers) గుడ్ న్యూస్ చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి సాగు చేసి గిట్టుబాటు ధర లేక, మార్కెట్ ఒడిదుడుకులతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి రైతులకు ప్రకటించిన రూ. 128.33 కోట్ల ఆర్థిక సహాయాన్ని నేడు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు. ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సాగు ఖర్చులు కూడా రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ నిధులు పెద్ద ఊరటనిస్తాయని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

​ఈ పంపిణీ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు చెందిన మొత్తం 37,752 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా ఉల్లి సాగుకు ప్రధాన కేంద్రమైన కర్నూలు జిల్లాపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు గాను రూ. 99.92 కోట్ల భారీ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ-క్రాప్ (e-Crop) గణాంకాల ఆధారంగా పారదర్శకంగా ఈ నిధులను పంపిణీ చేస్తున్నామని, అర్హులైన ప్రతి రైతుకూ న్యాయం చేస్తామని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రైతులు పడిన కష్టాలను తొలగించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Next Story