- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్స్యకారులకు అండగా.. ఏప్రిల్ 15 నుంచి సముద్రంలో వేట నిషేధం: మంత్రి ఆనం
ఆంధ్రా మత్స్యకారుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రా మత్స్యకారుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి హక్కుల పరిరక్షణ కోసం ఎంతటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారుల దాడులను దీటుగా తిప్పికొడతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో మంత్రి ఆనం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సముద్ర జలాల్లో భద్రత, మత్స్యకారుల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మాస్టర్ ప్లాన్ రూపకల్పన..
మత్స్యకారుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి తెలిపారు. దశాబ్దాలుగా ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళికను (మాస్టర్ ప్లాన్) రూపొందిస్తోందని వెల్లడించారు. తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకారులు హైపవర్ (అధిక సామర్థ్యం గల) బోట్లతో మన సముద్ర జలాల్లోకి చొరబడి మత్స్య సంపదను దోచుకుంటున్నారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్ర మత్స్యకారులకు ప్రభుత్వం సంపూర్ణ అండదండలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. సముద్ర జలాల్లో అక్రమ వేటను అరికట్టేందుకు, భద్రతను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏప్రిల్ 14వ తేదీ వరకు సముద్ర జలాల్లో ఈ గస్తీ ముమ్మరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నుంచి రెండు నెలల పాటు వేటపై నిషేధం అమల్లో ఉంటుందని మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మత్స్యకారుల సమస్యల పరిష్కారం, క్షేత్రస్థాయి పరిస్థితుల అధ్యయనం కోసం రేపు ఒక ప్రత్యేక బృందం నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి ఆనం పేర్కొన్నారు.






