- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మదనపల్లెలో భారీ చోరీ.. అమ్మవారి తాళిబొట్టును ఎత్తుకెళ్లిన దొంగలు
అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ శివార్లలోని శ్రీవారి నగర్‌లో వెలసిన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణ శివార్లలోని శ్రీవారి నగర్‌లో వెలసిన గోవర్ధనగిరి శ్రీకృష్ణ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రధాన ద్వారాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు, సుమారు రూ. 30 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. దొంగలు అత్యంత పకడ్బందీగా ఈ దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేయడమే కాకుండా, ఆధారాలు లభించకుండా ఉండేందుకు డీవీఆర్ (DVR)లను కూడా తమతో పాటు తీసుకెళ్లారు. ఆలయ ప్రాంగణంలోని హుండీలను ధ్వంసం చేసి అందులోని నగదును దోచుకున్నారు.
అపహరణకు గురైన వస్తువులల్లో అమ్మవారి బంగారు తాళిబొట్టు, స్వామివారి మూడు కిరీటాలు, వెండి కన్నులు, శంఖు చక్రాలు, శఠకోపం, పంచపాత్ర వంటి వెండి సామాగ్రి ఉన్నాయి. మంగళవారం ఉదయం నిత్య పూజా కార్యక్రమాల కోసం వచ్చిన అర్చకుడు, ఆలయ తలుపులు పగులగొట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మదనపల్లె రెండో పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్లూస్ టీమ్ ద్వారా వేలిముద్రలను సేకరించి, దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రూ. 30 లక్షల విలువైన ఆభరణాలు పోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






