గంజాయి బ్యాచ్ హల్ చల్.. సిటీ కేబుల్ కార్యాలయంపై అటాక్

by Thanuru Gopichand |

గంజాయి మత్తులో అకారణంగా దాడులు. బెంబేలెత్తిపోతున్న ప్రజలు.

గంజాయి బ్యాచ్ హల్ చల్.. సిటీ కేబుల్ కార్యాలయంపై అటాక్
X

దిశ, వెబ్ డెస్క్ : మచిలీపట్నంలో (Machilipatnam) గంజాయి బ్యాచ్ లు తమ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గంజాయి బ్యాచ్ లోని సభ్యులు మత్తులో పట్టణంలో హల్ చల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మత్తులో జోగుతూ గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వస్తూ ఆందోళన వాతావరణం కలిగిస్తున్నారు. శనివారం సాయంత్రం మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ లు హల్ చల్ చేసిన ఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. దీంతో వారి ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల వివరాల ప్రకారం మచిలీపట్నంలోని సిటీ కేబుల్ (Citi Cable) కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం కొంత హడావుడి నెలకొంది. గంజాయి మత్తులో కొందరు యువకులు రోడ్డుపై గొడవపడుతూ పరిసరాల్లో ఉన్నవారికి కంగారు పెట్టారు. అంతేకాకుండా అరుపులు, కేకలతో బెంబేలెత్తించారు. వారిలో వారు గొడవపడడమే కాకుండా రోడ్డున పోయే సామాన్యులపై సైతం తమ ప్రతాపం చూపించారు. ఈ క్రమంలో సిటీ కేబుల్ లో పనిచేసే చలపతి (Chalapathy) అనే వ్యక్తిపై కూడా దాడి చేశారు. వారిని వారించి అడ్డుకోబోయిన సిటీ కేబుల్ లో పనిచేసే ఇతర ఉద్యోగులపై దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా సిటీ కేబుల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. అక్కడ విధ్వంసం సృష్టించేందుకు యత్నించారు. వారి దాడిలో పలువురు సిటీ కేబుల్ ఉద్యోగులు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంజాయి బ్యాచ్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి దాడిలో గాయపడిన బాధితులను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story