- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maoist: మూడు దశాబ్దాలుగా అడవిబాటే..
ఛత్తీస్ గఢ్ రాష్ర్టం రాజ్ నంద్ గావ్ జిల్లా మదన్వాడ-కాంకర్ అటవీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజుల కిందట ఎన్కౌంటర్ లో మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్ మూడు దశాబ్దాల కిందటే అడవి బాట పట్టారు.

ఎన్ కౌంటర్లో మృతి చెందిన చిన్నన్న కర్నూలు జిల్లా వాసి
స్వగ్రామం ఆత్మకూరు మండలం వడ్లరామాపురంలో విషాదఛాయలు
పిల్లల చిన్న వయసులోనే ఉద్యమంలోకి..
మావోయిస్టు అగ్రనేతగా ఎదిగిన చిన్నన్న
ఆయనపై రూ.25 లక్షల రివార్డు
దిశ ప్రతినిధి, కర్నూలు : ఛత్తీస్ గఢ్ రాష్ర్టం రాజ్ నంద్ గావ్ జిల్లా మదన్వాడ-కాంకర్ అటవీ సరిహద్దు ప్రాంతంలో రెండు రోజుల కిందట ఎన్కౌంటర్ లో (encounter) మృతిచెందిన మావోయిస్టు అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ విజయ్ అలియాస్ శంకర్ మూడు దశాబ్దాల కిందటే అడవి బాట పట్టారు. ఆయనది ఉమ్మడి కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం వడ్లరామాపురం గ్రామం. మూడు దశాబ్దాలుగా భార్యా, పిల్లలను వదిలి అడవిబాట పట్టి వివిధ హోదాల్లో పని చేశా రు. 1992లో సాధారణ గ్రామ రైతు కూలీ సంఘం సభ్యుడుగా విప్లవ ప్రస్థానం ప్రారంభించారు. తర్వాత రైతు సంఘం ఏరియా కమిటీ అధ్యక్షుడిగా, భవనాసి దళం సభ్యుడిగా, కమాండర్ గా వివిధ పార్టీ కమిటీల్లో పనిచేశారు. 2005 చర్చ ల తర్వాత పార్టీ ఆదేశాల మేరకు దండకారణ్యం తరలివెళ్లారు. కాంకర్ సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా చిన్నన్న ఉన్నట్లు తెలుస్తోంది. అప్పట్లో కర్నూలు జిల్లా నుంచి పార్టీలోకి వెళ్లిన వారిలో ఈయన చివరి వాడు కావడం విశేషం. మృతుడికి సోదరులు, భార్యా ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు పసి వయస్సులోనే ఉద్యమంలోకి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన భార్య వడ్లరామాపురం గ్రామం వదిలి పుట్టినిల్లైన దుద్యాల గ్రామానికి వెళ్లింది. అక్కడే కూలి పనులు చేసుకుంటూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. మూడు దశాబ్దాల నుంచి భార్యా, పిల్లలు, సోదరులు టచ్ లో లేరు. చిన్నన్న గత 12-14 సంవత్సరాలుగా రాజ్‌నంద్‌గావ్-కాంకేర్ సరిహద్దు డివిజన్ ప్రాంతంలో చురుగ్గా పనిచేసినట్లు సమాచారం.
మే నెలలోనే మరణించారని..
కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో గత మే నెల 10, 11, 12 తేదీల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులను భద్రతా దళాలు ఎన్ కౌంటర్ చేశాయి. అప్పుడే సుగులూరి చిన్నన్న మరణించినట్లు అనుకున్నారు. ఈ విషయాన్ని ధ్రువీ కరించుకునేందుకు మే13న ఛత్తీస్ గఢ్ కు చెందిన ఇద్దరు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు జవాన్ల బృందం వడ్లరామాపురం వచ్చి చిన్నన్న గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆయన చనిపోలేదని నిర్థారించుకున్నారు. తాజా ఎన్ కౌంటర్ లో ఈయన మృతి చెందినట్లు ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఇవాళ లేదా రేపు భద్రతా దళాలు స్వగ్రామానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఆయనపై రూ.25 లక్షల రివార్డు ఉంది. చిన్నన్న మరణంతో గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి.






