జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్‌చల్‌.. ఇనుప రాడ్డుతో కార్లు ధ్వంసం

by Ramesh Naini |

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఒక వ్యక్తి హల్‌చల్‌ చేశాడు.

జనసేన పార్టీ కార్యాలయంలో వ్యక్తి హల్‌చల్‌.. ఇనుప రాడ్డుతో కార్లు ధ్వంసం
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కార్యాలయంలోకి చొరబడి హల్‌చల్‌ సృష్టించాడు. తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో అక్కడ పార్క్ చేసి ఉన్న రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో పార్టీ కార్యాలయంలోని సిబ్బంది, కార్యకర్తలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

నిందితుడు ఇచ్చాపురానికి చెందిన వ్యక్తి..

కార్లను ధ్వంసం చేస్తున్న వ్యక్తిని గమనించిన పార్టీ ప్రతినిధులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మంగళగిరి పట్టణ పోలీసులు హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. రాష్ట్ర ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఈ దాడి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? లేక వ్యక్తిగత కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. పార్టీ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story