మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

by Malleboina Mahesh |

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తులో కార్మికులు చిక్కుకోగా, దట్టమైన పొగ వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.

మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం (Machkhand Hydroelectric Power Station)లో శనివారం భారీ అగ్నిప్రమాదం (Major fire accident) సంభవించింది. పవర్ స్టేషన్‌ను సాంకేతిక కారణాలతో అత్యవసరంగా షట్‌డౌన్ చేసిన వెంటనే ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. ప్రమాదం జరిగిన సమయంలో పవర్ స్టేషన్ రెండో అంతస్తులో విధుల్లో ఉన్న కార్మికులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తుంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు తోటి సిబ్బంది ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రమాద తీవ్రత వల్ల లోపల దట్టమైన పొగ అలుముకోవడం తో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నట్లు సమాచారం.

మరోవైపు, ఈ జలవిద్యుత్ కేంద్రం కొండల మధ్య మారుమూల ప్రాంతంలో ఉండటం వల్ల అగ్నిమాపక సిబ్బంది (ఫైర్ టెండర్లు) ఘటనా స్థలానికి చేరుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం పవర్ హౌస్ రెండో అంతస్తులో అసలు ఎంత మంది కార్మికులు చిక్కుకున్నారనే దానిపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. పొగలు, మంటలను అదుపు చేస్తూ లోపల ఉన్న వారిని రక్షించడమే లక్ష్యంగా స్థానిక యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు తెలుస్తుండగా.. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రావాల్సి ఉంది.

Next Story