అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్తంభాలు

by Kema Shiva Kumar |

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల్లో స్తంభాలు కూలి ట్రాక్‌పై ఉన్న విద్యుత్ తీగలపై పడ్డాయి.

అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం: కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి స్తంభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అనకాపల్లి రైల్వే స్టేషన్‌ (Anakapalli Railway Station)లో జరుగుతున్న నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. స్టేషన్‌లోని మూడో నెంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వంతెనకు సంబంధించి భారీ స్తంభాలను అమర్చుతుండగా, అవి ఒక్కసారిగా ప్లాట్‌ఫారమ్‌పై కుప్పకూలాయి. అయితే, ఆ భారీ స్తంభాలు నేరుగా హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడటంతో అవి తెగిపోయాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో మంటలు రావడంతో స్టేషన్ అంతా గందరగోళం నెలకొంది.

ప్రమాదం జరిగిన సమయంలో ప్లాట్‌ఫారమ్‌పై ఎలాంటి రైలు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఒకవేళ ఆ సమయంలో రైలు ఉండి ఉంటే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు భావిస్తున్నారు. పనుల్లో నిమగ్నమైన ఇద్దరు కూలీలు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. నిర్మాణ పనుల్లో అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే అధికారుల విచారణ చేపట్టారు.

Next Story