హిందూ సోదరుడిగా క్షమాపణలు చెబుతున్నా: ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు

by Vemula.Srinu Prasad |

హిందూ సోదరుడిగా క్షమాపణ కోరుతున్నానని మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు తెలిపారు..

హిందూ సోదరుడిగా క్షమాపణలు చెబుతున్నా:  ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు
X

దిశ, మడకశిర: హిందూ సోదరుడిగా క్షమాపణ కోరుతున్నట్లు మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పేర్కొన్నారు. భగవద్గీతని అవమానపరిచినట్లు వైసీపీ, అనుకూల సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాలను ఎమ్మెల్యే, టిటిడి పాలకమండలి సభ్యులు ఎంఎస్ రాజు ఖండించారు. తాను హిందువునని, రాజ్యాంగం వల్లే దళితుల జీవితాల్లో వెలుగులు వచ్చాయని ఎంఎస్ రాజు తెలిపారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక వీడియా విడుదల చేశారు.

‘‘ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనుకూల సోషల్ మీడియా, మరికొన్ని యూటూబ్ చానల్స్‌లో నేను భగవద్గీతని అవమాన, అగౌరవ పరిచినట్లు అసత్యపు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఎక్కడా కూడా భగవద్గీతను, ఇతర మత గ్రంథాలను కించపరిచినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కేవలం డా.బిఆర్ అంబేడ్కర్ గొప్పతనం, భారత రాజ్యాంగం గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం మాత్రమే చేశాను. భగవద్గీత, ఖురాన్ వంటి మహా గ్రంథాల వలన దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. కానీ రాజ్యాంగం వలన దళితుల జీవిత ప్రమాణాలు మెరుగుపడ్డాయి అని మాత్రమే తెలియజేయడం జరిగింది తప్ప ఎక్కడా భగవద్గీతను అవమానపరిచే వ్యాఖ్యలు చేయలేదు. హిందూ సమాజాన్ని కించపరిచే వ్యాఖ్యలు నేను చేయలేదు. కేవలం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలపై ప్రజలు హర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని డైవర్ట్ చేసేందుకు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కుట్రలో భాగంగా నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ’’ అని మండిపడ్డారు.

‘‘ముఖ్యమంత్రి నాకు టిటిడి పాలకమండలి సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. నా నియోజకవర్గంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించాలని, ఎనిమిది నెలల క్రితమే నేను లేఖ రాయడం జరిగింది. ముఖ్యమంత్రి రాష్ట్రంలో 5,000 దేవాలయాలు నిర్మించాలని టిటిడిని ఆదేశిస్తే ఎక్కువ శాతం గుడులు దళిత వాడల్లోనే నిర్మించాలని టిటిడి బోర్డుకి విజ్ఞప్తి చేసినవాడిని నేను అన్నారు. కానీ కొన్ని వైసీపీ సోషల్ మీడియా బ్యాచ్‌లు పనిగట్టుకొని నేను క్రైస్తవుడని అసత్యపు ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను వైసీపీ నాయకులు సవాల్ విసురుతున్నా.నేను పుట్టిన ఊరికి వెళ్ళి మా ఫ్యామిలీ గురించి పూర్తిగా విచారణ చేసుకోవచ్చు. నేను హిందువుడిని. వేంకటేశ్వర స్వామి భక్తుడిని. మీ కరుణాకర్ రెడ్డిలాగా ఇంట్లో ఒక మతాన్ని ఆచరిస్తూ పదవుల కోసం బయట హిందువుడిలా డ్రామాలు ఆడేటటువంటి వ్యక్తిని నేను కాను. దయచేసి వైసీపీ చేస్తున్న కుట్రలో భాగస్వామ్యం కావొద్దని నా హిందూ సమాజాన్ని కోరుతున్నా. భగవద్గీతను నేను కించపరిచానని మీ మనోభావాలు దెబ్బతిని ఉంటే నేను ఒక హిందూ సోదరుడిగా మీకు క్షమాపణలు చెబుతున్నా” అని ఎమ్మెస్ రాజు తెలిపారు.

Next Story