ప్రేమికులే టార్గెట్.. ఏకాంతంగా ఉన్న జంటలను వీడియోలు తీసి ASI వసూళ్ల దందా!

by Prasad Jukanti |   (  Updated:2026-04-11 10:42:48  IST  )

ప్రేమికులను టార్గెట్ చేసి, ఏకాంతంగా ఉన్న వీడియోలతో డబ్బు, లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్న ఏఎస్సై ఉదంతం కలకలం రేపుతోంది.

ప్రేమికులే టార్గెట్.. ఏకాంతంగా ఉన్న జంటలను వీడియోలు తీసి ASI వసూళ్ల దందా!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే కీచకులుగా మారితే ఇక సామాన్యులకు దిక్కెవరు?. అచ్చం ఇలాంటి ఘటనే ఏపీలో కలకలం రేపుతోంది. ఏకాంతంగా ఉన్న ప్రేమికుల జంటలను ఫోన్‍లో వీడియోలు తీసి వాటిని చూపించి బెదిరించడంతో పాటు తన కోరికలు తీర్చాలని వేధిస్తున్న ఓ ఏఎస్సై (ASI) నిర్వాకం బట్టబయలైంది. పల్నాడు (Palnadu) జిల్లా మాచర్ల (Macherla) నియోజకవర్గంలో పోలీసులే సాగిస్తున్న ఈ తతంగం ఇప్పుడు ఎస్పీ వరకు చేరడంతో దీనిపై పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది.

డబ్బుతో ఆగని దాహం.. కోరిక తీర్చాలంటూ..

మాచర్ల నియోజకవర్గంలోని పర్యాటక ప్రాంతాలకు, ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు కళాశాల విద్యార్థులు, ప్రేమికులు వస్తుంటారు. దీనినే ఆ ఏఎస్సై తన సంపాదన మార్గంగా మార్చుకున్నాడు. ఇక్కడికి వచ్చిన యువతీ యువకులు ఎవరైనా ఏకాంతంగా ఉన్నట్లు గమనిస్తే వారిని సదరు ఏఎస్సై వీడియోలు తీయించి, స్టేషన్‍కు పదండంటూ బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేస్తున్నాడు. అంతడితో ఆగకుండా తన కోరిక తీర్చాలంటూ యువతులను బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇలా జంటల వీడియోలను రికార్డు చేసేందుకు ఏకంగా జమ్మలమడుకకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ను తన ఏజెంట్‌గా నియమించుకుని ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

ఆ వ్యాపారీ వీడియోతో గుట్టు రట్టు:

ఇటీవల మాచర్లలో ఓ వ్యాపారి ఓ మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో తీసి వారిని బెదిరించి పలు దఫాలుగా లక్షల రూపాయలు వసూలు చేశారు. ఇదే స్టేషన్ లో పని‍చేస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇదే దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మాచర్ల వ్యాపారి ఘటనతో ఇక్కడి పోలీసులు సాగిస్తున్న ఈ గలీజ్ దందా బయటపడినట్లు టాక్ వినిపిస్తోంది. పోలీసుల వసూళ్ల పర్వానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం కాస్త జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. దీనిపై జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును మాట్లాడుతూ.. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయమై తమకు సమాచారం అందిందన్నారు. దీనిపై విచారించి తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఈ ఘటన మాచర్ల పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. ఆత్మాభిమానం దెబ్బతింటుందనే భయంతో బయటకు చెప్పలేక ఎంతో మంది బాధితులు కుమిలిపోతున్నారని, సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story