- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రహ్మోత్సవాలు.. శ్రీశైలంలో శివదీక్ష భక్తుల నిరసన
శ్రీశైల దేవస్థాన అధికారులపై శివస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 గంటలుగా క్యూలైన్లో నిలబడి ఉన్నా దర్శనం కల్పించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో శివదీక్ష భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఇరుముడులు తలపై పెట్టుకుని దర్శనం కోసం క్యూ లైన్లోకి వెళ్లగా.. గంటల తరబడి వెయిట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయంలో క్రౌడ్ మేనేజ్ చేయడంలో సరైన ఏర్పాట్లు చేయలేదని, సిబ్బంది ఈ విషయంలో విఫలమయ్యారని ఆరోపించారు. బారికేడ్లను తోస్తూ.. కృష్ణదేవరాయ క్యూలైన్ల గేట్లను విరగొట్టి ఆలయంలోకి చొచ్చుకుని వెళ్లారు. ఒక్కసారిగా వందలాదిమంది శివస్వాములు రావడంతో పరిస్థితి అదుపుతప్పింది. పుష్కరిణి వైపు కూడా శివస్వాములు గేట్లు ఎక్కి వెళ్తుండటంతో.. సిబ్బంది, పోలీసులు కట్టడి చేయలేక చేతులెత్తేశారు. పుష్కరిణి వైపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు పోలీసులను కోరారు.
నిన్న సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లోకి వచ్చిన తమకు సరైన ఏర్పాట్లు కూడా లేవని వాపోయారు. కనీసం మంచినీరు కూడా అందించడం లేదని, 12 గంటలుగా క్యూలైన్లలోనే నిలబడి ఉన్నామని అసహనం వ్యక్తం చేశారు. ఈఓకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భిక్ష పెట్టకుండా, మంచినీరు ఇవ్వకుండా, కనీసం బాత్రూమ్ కు వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. శివస్వాములకు మాత్రమే స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకే సమయం ఉండటంతో దర్శనానికి 4-6 గంటల సమయం పడుతోంది. ఈ సమయంలో కూడా వీఐపీల దర్శనానికే ప్రాధాన్యమివ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.






