Lokesh: చదువుకో చిట్టి తల్లీ.. చిన్నారి జెస్సీ కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

by Ramesh Naini |

చదువుకో చిట్టి తల్లీ.. అంటూ చిన్నారి జెస్సీకి కేజీబీవీలో మంత్రి నారా లోకేశ్ సీటు ఖాయం చేశారు.

Lokesh: చదువుకో చిట్టి తల్లీ.. చిన్నారి జెస్సీ కల నెరవేర్చిన మంత్రి లోకేశ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందిన విద్యార్థిని జెస్సీకి కేజీబీవీలో సీటు రాకపోవడంతో చదువు ఆపేసింది. కేజీబీవీలో సీటు రాలేదని.. బాలికను చదివించే స్తోమత ఆ చిన్నారి కుటుంబానికి లేకపోవడంతో తమ వెంటే తెలంగాణలో పొలం పనులకు తీసుకెళ్లారు. కానీ చిన్నారికి మాత్రం చదువుకోవాలనే కోరిక బలంగా ఉంది. ఈ వ్యవహారంపై టీడీపీ అగ్రనేత, ఏపీ మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) స్పందించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ.. ‘కేజీబీవీలో సీటు రాలేదని పత్తి పొలాల్లో కూలీగా వెళుతున్న జెస్సీ కథనం నన్ను కదిలించింది. చదువుకోవాలనే జెస్సీ ఆశను వెలుగులోకి తీసుకొచ్చిన మీడియాకు అభినందనలు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లీ! కేజీబీవీలో నీకు సీటు వస్తుంది. నిశ్చింతగా చదువుకో! పరిస్థితులు ఏమైనా కానీ పుస్తకాలు, పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరం. మీరు పిల్లలను బడికి పంపితే తల్లికి వందనం వస్తుంది. చక్కనైన యూనిఫామ్, పుస్తకాలు, బ్యాగు, బూట్లు, సాక్సులు, బెల్ట్ ఇస్తున్నాం. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. మనబడిలో పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దే బాధ్యత మాది. పిల్లల భద్రత, భవితకు భరోసానిచ్చే బడికి మించిన సురక్షిత ప్రదేశం లేదు. విద్యకు పిల్లలను దూరం చేయొద్దని తల్లిదండ్రులను వేడుకుంటున్నాను’ అని మంత్రి భరోసా ఇచ్చారు.

Next Story