గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి : డిప్యూటీ సీఎం

by Thanuru Gopichand |

అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల (Tribal) జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని..

గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి : డిప్యూటీ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్ : అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల (Tribal) జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని.. వారి ఆదాయ మార్గాలు పెంచే విధంగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అధికారులకు స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, ఎకో టూరిజం, పర్యాటకం పెంపు వంటి కీలకమైన అంశాలను ప్రతిపాదికగా తీసుకొని గిరిజన యువతలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్నారు. శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దర్ లతో డిప్యూటీ సీఎం మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

మమేకం అవ్వడం మరచిపోవద్దు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులు, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఎంతో డిమాండ్ ఉందన్నారు. కాఫీ తోటలతోపాటు అడవిలో విరివిగా దొరికే ఉత్పత్తులను సాగు చేసేలా గిరిజనులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. మార్కెట్ డిమాండు అనుసారం అటవీ ఉత్పత్తులను విరివిగా పెంచేలా చూడాలన్నారు. నిత్యం గిరిజనులతో మమేకం కావడం, వారి ఆలోచనలను వినడం, వారికి సహాయం చేయడం మర్చిపోవద్దని స్పష్టం చేశారు. విభిన్న మార్గాల్లో ఎలా ఆదాయం పొందాలో యువతలో స్ఫూర్తి నింపి, వారిని ఎంటర్ ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను వారికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

ఉపాధి పనులకు అనుసంధానం

ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యాన పంటలకు అనువుగా ఉంటుందని.. దాన్ని ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనిపై మరింతగా దృష్టి సారించి, వివిధ రకాల పనులకు ఉపాధి హామీ అనుసంధానం అయ్యేలా అధికారులు పరిశీలన చేయాలని ప్రస్తావించారు.

ప్రకృతిని రక్షిస్తూ పర్యాటకం

ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యాటకం పెంపుదల ప్రధానమైన అంశంగా పరిగణించాలని అధికారులకు డిప్యూటీ సీఎం వివరించారు. ప్రతి ఒక్కరిరీ నేడు పర్యాటకం మీద ఆసక్తి పెరుగుతోందన్నారు. ఎకో టూరిజం అనేది ప్రపంచంలో వేగవంతంగా అభివృద్ది చెందుతున్న రంగంగా వర్ణించారు. దాన్ని అందిపుచ్చుకొని సహజమైన ప్రకృతి సంపదకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా ఎకో టూరిజం పెంపుదలపైన గిరిజనులకు తగిన అవగాహన కల్పించాలని అన్నారు. యువతకు టూరిజం వల్ల వచ్చే లాభాలు, పర్యాటకులకు వసతి కల్పించడం ద్వారా అందే ఆదాయం మీద చైతన్యం కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలియజేశారు.

ఏజెన్సీలో షూట్ చేసేందుకు ప్రోత్సహించాలి

సినిమాలు, సీరియళ్లతో పాటు ఓటీటీలో వచ్చే వివిధ రకాల కంటెంట్ లను ఏజెన్సీ ప్రాంతాల్లో షూట్ చేసుకునేలా ప్రొత్సహించాలని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. దీని వల్ల గిరిజనులకు ఆదాయం పెరగడంతో పాటు యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. సమన్వయంతో యంత్రాంగం ముందుకు సాగితే కచ్చితంగా గిరిజనుల బతుకు చిత్రాలు మారుతాయని విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. దీనికి అనుగుణంగా పకడ్భందీ ప్రణాళికను సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీనిచ్చారు.

Next Story