- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుప్పం ఎయిర్‌పోర్ట్‌కు ‘సుప్రీం’ గ్రీన్ సిగ్నల్: భూసేకరణపై పిటిషన్లు కొట్టివేత
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రతిష్టాత్మక విమానాశ్రయ నిర్మాణానికి ఉన్న అతిపెద్ద న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. కుప్పం విమానాశ్రయ భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ భూసేకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కొందరు రైతులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేశారు. అయితే, హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సుమారు 150 ఎకరాల సేకరణ కోసం జిల్లా కలెక్టర్ జారీ చేసిన నాలుగు నోటిఫికేషన్లు చట్టబద్ధంగానే ఉన్నాయని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ముగిసిన అడ్డంకులు..
ఈ కేసుతో పాటు పెండింగ్‌లో ఉన్న ఇతర అనుబంధ పిటిషన్లను కూడా సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో కుప్పం విమానాశ్రయం విషయంలో ఉన్న అన్ని న్యాయపరమైన వివాదాలు ముగిసినట్లయింది. ప్రభుత్వ నోటిఫికేషన్లు నిబంధనల ప్రకారమే ఉన్నాయని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు ముఖ్యమని న్యాయస్థానం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుతో కుప్పం విమానాశ్రయ నిర్మాణ పనులకు లైన్ క్లియర్ అయింది. ఈ తీర్పుపై కుప్పం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత పారిశ్రామిక, రవాణా రంగాల్లో భారీ మార్పులు వస్తాయని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం త్వరలోనే పనులను వేగవంతం చేసే అవకాశం ఉంది.






