ధాన్యం కుప్పలపై కప్పేందుకు వెళ్లి.. పిడుగుపాటుకు కౌలు రైతు మృతి

by Naga Rani Yarlagadda |

ఆకస్మిక వర్షంతో పాటు పడిన పిడుగు ధాటికి కౌలు రైతు మరణించిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.

ధాన్యం కుప్పలపై కప్పేందుకు వెళ్లి.. పిడుగుపాటుకు కౌలు రైతు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆకస్మికంగా కురిసిన వర్షం, ఉరుములు-మెరుపుల మధ్య పిడుగు పడి ఓ కౌలు రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సామర్లకోటలోని కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయం సమీపంలో జరిగింది. మృతుడు పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామానికి చెందిన పెన్నాడ అర్జున్‌రావు (63)గా గుర్తించారు. కుటుంబ పోషణ కోసం కౌలు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న అర్జున్‌రావు, ఇటీవల కోసిన ధాన్యాన్ని వర్షం తడవకుండా కాపాడేందుకు పట్టాలు (తార్పులు) కప్పుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇదే సమయంలో భారీ ఉరుములతో కూడిన మెరుపు పడటంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయినట్లు స్థానికులు తెలిపారు. పక్కనే ఉన్న రైతులు, స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే అర్జున్‌రావు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ ఘటనతో జి. రాగంపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అర్జున్‌రావు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతుండగా, గ్రామస్తులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఇలా కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం అని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, పొలాల్లో పనిచేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు పడే అవకాశం ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదని, బహిరంగ ప్రదేశాల్లో పని చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

Next Story