- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని జనావాస ప్రాంతాల్లో ఇటీవల చిరుతలు.. పులుల సంచారం పెరిగిపోయింది. దీంతో ప్రజల్లో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణాల్లో వాటి సంచారం కలకలం రేపుతోంది. వారంలో కనీసం ఓ మూడు రోజులు చిరుతలు, పులి సంచారం ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మన్యం ప్రాంతాల్లో ఏనుగులు హల్ చల్ చేస్తుండగా పట్టణాలు, గ్రామాల్లో పులులు తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయితే అటవీ మృగాలు, జంతువులు జనావాసాల్లోకి రావడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడవుల సంఖ్య తగ్గుతుందా లేక అడవుల్లో వాటికి సహజంగా లభించాల్సిన ఆహారం లభించడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణంగా ఆహారం కోసమే జంతువులు వేటను సాగిస్తుంటాయి. ఇటీవల అవి జనావాసాల్లోకి వస్తుండడంతో అడవిలోని పర్యావరణ పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు, పర్యావరణ ప్రేమికులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద..
నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో (Srisailam) కొలువుదీరిన భ్రమరాంబ సమతే మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. నల్లమల్ల కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ దేవాలయం కొలువై ఉంది. అయితే ఇక్కడ అప్పుడప్పుడు చిరుతలు తిరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద చిరుత కదలాడిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయని అధికారులు పేర్కొంటున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో పుణ్య స్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గతేడాది జనవరిలో కూడా శ్రీశైలం పూజారి ఇంట్లోకి చిరుత ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లాలోని కోసిగి (Kosigi) మండల పరిధిలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. అధికారుల వివరాల ప్రకారం మండలంలోని గౌడుగల్ గ్రామ సమీపంలో కొండ ప్రాంత ఉంది. అక్కడ నుంచి రెండు చిరుతలు గ్రామంలోకి ప్రవేశించి ప్రయత్నం చేశాయి. అది గమనించి గ్రామస్తులు అప్రమత్తమై వాటిని గదమాయించారు. దీంతో భయపడిన చిరుతలు తిరిగి కొండల్లోకి పరుగుపెట్టాయి. అయితే ఈ విషయంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటిని బంధించి డీప్ ఫారెస్ట్ లోకి వదిలేయాలని, తమ భద్రతకు భరోసానివ్వాలని కోరుతున్నారు.






