- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనవాసాల్లోకి పెద్దపులి.. కాకినాడ జిల్లాలో అటవీశాఖ హై అలర్ట్
గత 16 రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి కదలికలు పెను సంచలనంగా మారాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: గత 16 రోజులుగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెద్దపులి కదలికలు పెను సంచలనంగా మారాయి. అటవీ ప్రాంతం నుంచి జనసంచారం ఉన్న ప్రదేశాల్లోకి పులి చేరుకోవడంతో స్థానిక ప్రజలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం ఈ పులి శంఖవరం మండల కేంద్రంలోని ఉరకొండపై తిరుగుతుండటం గమనార్హం. పులి సంచరిస్తున్న ప్రాంతానికి అతి సమీపంలోనే తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసుతో పాటు ఎస్సీ బాయ్స్ హాస్టల్, కస్తూర్బా పాఠశాల వంటి జన సంచారం అధికంగా ఉండే సంస్థలు ఉన్నాయి. పులి ఏ క్షణాన ఎటు నుంచి దాడి చేస్తుందోనని స్థానికులు వణికిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన అటవీశాఖ అధికారులు ఆయా ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
అధికారుల వ్యూహాలు-క్షేత్రస్థాయి పరిస్థితి
పులిని బంధించేందుకు అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపన్న దొర చెరువును ఈదుకుంటూ పులి శంఖవరం కొండల్లోకి చేరింది. రాత్రి సమయాల్లో జి.కొత్తపల్లి వద్ద పులిని పట్టుకునేందుకు ప్రత్యేక బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న దిశను బట్టి పులి రౌతులపూడి మండలంలోకి గానీ, లేదా అన్నవరం పంపా రిజర్వాయర్, వజ్రకూటం కొండల వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
శంఖవరం, నెల్లిపూడి, కె.కొత్తూరు, మండపం, శృంగవరం, పారుపాక, చామవరం గ్రామస్తులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సంయుక్తంగా నిఘా పెంచాయి. చీకటి పడ్డాక ఎవరూ ఒంటరిగా బయటకు రావద్దని, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.






