Ap News: కేవీపీ గుట్టు విప్పబోతున్నారా?.. తీవ్ర టెన్షన్‌లో వైసీపీ నేతలు

by Disha Web Desk 16 |
Ap News: కేవీపీ గుట్టు విప్పబోతున్నారా?.. తీవ్ర టెన్షన్‌లో వైసీపీ నేతలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజకీయాల్లో ఒకప్పుడు అపరచాణిక్యుడు. ఎవరిని ఎక్కడ పెట్టాలి.. ఎవరికి ఏ పదవి కట్టబెట్టాలనేది అయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే ఆయననను వైఎస్ఆర్ ఆత్మ అని పిలుస్తుంటారు. దివంగత సీఎం సైతం అనేక బహిరంగ సభలలో తన ఆత్మ అని సగర్వంగా చెప్పుకునే వారు. ఇంతకీ ఆ నేత ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదూ ఇంకెవరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. వైఎస్ మరణం తర్వాత జగన్ వెంట నడుస్తారని అంతా భావించారు. కానీ కేవీపీ కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అనంతరం రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో పోరాటం చేశారు. ఆ తర్వాత మౌనంగా ఉన్న కేవీపీ రామచంద్రరావు ఉన్నట్లుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. తన ముఖ్య అనుచరుడు గిడుగు రుద్రరాజును పీసీసీ చీఫ్ పీఠంపై కూర్చోబెట్టారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్‌కు దూరంగా ఉంటున్న కేవీపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్‌ను కాదని చంద్రబాబును పొగడటం ప్రాధాన్యం సంతరించుకుంది.

తాజాగా విజయవాడలో జరిగిన మీట్‌ది ప్రెస్‌లో కేవీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌కు దగ్గరగా ఉన్న తాను.. జగన్‌కు ఎందుకు దూరమయ్యానో త్వరలో ప్రెస్‌మీట్‌ పెట్టి చెబుతాననన్నారు. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు కురిపిస్తున్న కేవీపీ రామచంద్రరావు.. జగన్‌కు ఎందుకు దూరమయ్యారో చెప్తానంటూ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే ఏదైనా బాంబు పేల్చబోతున్నారా అంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఎందుకు దూరమమ్యారు?

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. తాజాగా విజయవాడలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీలోని రాజకీయ పార్టీలు ముఖ్యంగా వైసీపీ, టీడీపీలపై మండిపడ్డారు. వైసీపీకి లోక్‌సభలో 22 మంది, రాజ్యసభలో 10 మంది సభ్యులు ఉన్నారు. అయితే వారెవరూ రాహుల్ గాంధీ అనర్హతపై ప్రశ్నించడం లేదని నిలదీశారు. బీజేపీతో వైసీపీకి గల అంతర్గత, చీకటి ఒప్పందాలు ఏమున్నాయో తనకు తెలియట్లేదని, కేంద్రాన్ని ప్రశ్నించే విషయంలో వైసీపీ జంకుతోందని అభిప్రాయపడ్డారు.

ఇదే సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న తాను.. ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే విషయాన్ని త్వరలోనే బయటపెడతానని కేవీపీ స్పష్టం చేశారు. ఈ అంశంపై చాలా వివరంగా మాట్లాడుకోవాల్సి ఉంటుందని అందుకు వేరే ప్రెస్మీట్ పెడతానంటూ కుండబద్దలు కొట్టారు. వైఎస్ఆర్ స్నేహానికి, కుటుంబ బాంధవ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, ఆయన ఓ గొప్ప రాజనీతిజ్ఞుడని కేవీపీ రామచంద్రరావు కొనియాడారు.

ఇంటిగుట్టు విప్పుతారా?

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మగా పేర్గాంచిన కేవీపీ రామచంద్రారావు సీఎం వైఎస్ జగన్‌కు ఆది నుంచి దూరంగా ఉంటున్నారు. తండ్రికి ఆప్తుడిగా ఉన్న ఆయన తనయుడికి రాజకీయ ప్రత్యర్థిగా ఎందుకు వ్యవహరిస్తున్నారనే దానిపై రాజకీయ వర్గా్ల్లో ఇప్పటికీ చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన వారంతా వైఎస్ జగన్ చెంత చేరితే అన్నీ తెలిసిన కేవీపీ మాత్రం రాను రాను దూరంగా ఉంటున్నారు. అయితే ఎందుకు జగన్‌తో దూరం కావల్సి వచ్చిందనేది త్వరలోనే బయటపెడతానని తెలిపారు కేవీపీ రామచంద్రరావు. వైఎస్ఆర్ కుటుంబం గురించి కేవీపీకి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్ కుటుంబ,ఆర్థిక వ్యవహారాలు కేవీపీ తెలుసునని రాజకీయాల్లో భోగొట్టా. అయినప్పటికీ వైఎస్ ఇంటి గుట్టును ఎప్పుడూ బ‌య‌ట పెట్టలేదు కేవీపీ రామచంద్రరావు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కాదని ఓదార్పుయాత్ర చేపట్టినా కూడా కేవీపీ ఒక్క విమర్శ కూడా చేయలేదు. అలాంటి వైఎస్ ఆత్మ తాజాగా మాట్లాడేందుకు రెడీ అవుతోంది. రాజకీయాల్లో ఎంతో బలంగా ఉన్న వైఎస్ జగన్‌తో తనకున్న బంధం, అనుబంధం, ఎందుకు విభేధించాల్సి వచ్చింది అనే అంశాలపై కేవీపీ ఏం చెప్పబోతున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు జగన్‌ను సైకోగా, అవినీతిపరుడగా చిత్రీకరిస్తూ వస్తున్న తరుణంలో అదే కోణంలో కేవీపీ వ్యాఖ్యలు చేస్తారా లేక వేరే కోణాన్ని బయటపెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. అసలే వైసీపీ కష్టకాలంలో ఉంది. అందులోనూ ఏడాదిలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్‌తో కేవీపీకి చెడింది అనటానికి గల ఇంటిగుట్టును ఏవిధంగా బయటపెడతారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

చంద్రబాబుపై ప్రశంసలు

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటుపై పోరాటం చేస్తున్న నేతల్లో కేవీపీ రామచంద్రరావు ఒకరు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు విషయంలో ఏపీలోని రాజకీయ పార్టీల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు కేవీపీ. రాహుల్ అనర్హత గురించి దేశంలోని విపక్షాలన్నీ కదం తొక్కితే ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన నోరు మెదపకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ప్రశంసల జల్లు కురిపించారు. రాహుల్ అనర్హత వేటుపై మీరెందుకు మాట్లాడరు చంద్రబాబు అంటూనే.. మీరు ఢిల్లీలో ఉండాల్సిన నేత.. మకాం మార్చాలి అంటూ ఒక్కసారిగా చంద్రబాబును ఆకాశానికెత్తేశారు. అత్యంత గౌరవం ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటూ కితాబిచ్చారు. 1984లో నాదెండ్ల సంక్షోభం సమయంలో చంద్రబాబు పోరాటాన్ని ఎవరూ మర్చిపోరని గుర్తు చేశారు. చంద్రబాబు శక్తి సామర్థ్యాలపై తనకు నమ్మకం ఉందని, చంద్రబాబు జూలు విదిల్చి తన కార్యస్థానాన్ని ఢిల్లీకి మార్చాలంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమంలోకి చంద్రబాబు రావాలని కేవీపీ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మనసులో చంద్రబాబుకు ఉన్న స్థానాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. 2018లో ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారని... 2019ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే చంద్రబాబును కించపరచొద్దంటూ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ సూచించిన విషయాన్ని కేవీపీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత వేటు విషయంలో మౌనం వీడాలని కేవీపీ రామచంద్రరావు సూచించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగిన కేవీపీ రామచంద్రరావు ఉన్నట్లుండి చంద్రబాబును పొగడ్తల్లో ముంచెత్తడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.

జగన్‌పై విమర్శలు

వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు సతీసమేతంగా హాజరయ్యారు. వీఐపీ గ్యాలరీలో ఒక సాధారణ వ్యక్తిలానే కూర్చున్నారు. దీంతో సీఎం జగన్‌తో కేవీపీ కలిసి నడుస్తారని ప్రచారం జరిగింది. కానీ అలా జరగలేదు. వైఎస్ జగన్ రానీయలేదో లేక కేవీపీ రామచంద్రరావే వెళ్లడానికి ఇష్టపడలేదో తెలియదుగానీ జగన్‌కు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడిగా ఉంటానని ప్రకటించారు. అనంతరం జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్‌పై అడపాదడపా విమర్శలు సైతం చేస్తున్నారు. వైఎస్ విజయమ్మ నేతృత్వంలో జరిగిన వైఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ సందర్భంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేవీపీ గుర్తు తెచ్చుకుని భావోద్వేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఇటీవల పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేయవద్దని సీఎం జగన్‌కు సూచించారు. పోలవరం విషయంలో ఎత్తు తగ్గించాలని కేంద్రం చేస్తున్న ఒత్తిడికి తొలగ్గితే రాష్ట్ర ద్రోహానికి పాల్పడినట్లేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు వైఎస్ జగన్ రాష్ట్రాన్ని దివాలా తీయించేశారంటూ సంచలన వ్యాఖ్యలు సైతం చేశారు. అక్కడితో ఆగిపోలేదు మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపైనా స్పందించారు. నిందితులు ఎవరైనా శిక్ష పడాల్సిందేనని కేవీపీ డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed