‘నా జాక్ ను చంపేశారు!’.. కర్నూలు ఆస్పత్రి ఎదుట బాధితుడి కన్నీటి పర్యంతం

by Ramesh Naini |   (  Updated:2026-04-11 15:08:52  IST  )

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కను వైద్యుల నిర్లక్ష్యం బలితీసుకుందంటూ ఓ యజమాని బోరున విలపిస్తున్న హృదయ విదారక ఘటన కర్నూలులో చోటుచేసుకుంది.

‘నా జాక్ ను చంపేశారు!’.. కర్నూలు ఆస్పత్రి ఎదుట బాధితుడి కన్నీటి పర్యంతం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్కను వైద్యుల నిర్లక్ష్యం బలితీసుకుందంటూ ఓ యజమాని బోరున విలపిస్తున్న హృదయ విదారక ఘటన కర్నూలులో చోటుచేసుకుంది. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళితే, నాలుగు ఇంజెక్షన్లు వేసి తన 'జాక్' (కుక్క పేరు) ప్రాణాలు తీశారంటూ బాధితుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాధిత యజమాని తెలిపిన వివరాల ప్రకారం.. తన పెంపుడు కుక్క 'జాక్'కు జ్వరం రావడంతో కర్నూలులోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అప్పటివరకు జ్వరంతో ఉన్నప్పటికీ జాక్ చురుకుగానే తిరిగింది. అయితే ఆసుపత్రి సిబ్బంది కుక్కకు నాలుగు ఇంజెక్షన్లు వేశారు. ఆ తర్వాత కుక్కను తీసుకుని ఇంటికి వెళ్లిన పది నిమిషాలకే అది ప్రాణాలు విడిచింది. ‘అసలు వారు ఏం ఇంజెక్షన్లు వేశారో కూడా నాకు తెలియదు. జ్వరంతో ఉన్నా మంచిగానే ఆడుకున్న నా కుక్కను వైద్యులు చంపేశారు’ అంటూ తన పెంపుడు జంతువు మృతదేహాన్ని చేతబట్టుకుని ఆస్పత్రి ఎదుట బాధితుడు తీవ్ర ఆరోపణలు చేశాడు.

పట్టించుకోని పోలీసులు..?

తన కుక్క మృతికి కారణమైన ఆస్పత్రి సిబ్బందిపై ఫిర్యాదు చేసేందుకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే పోలీసులు తన ఫిర్యాదును కనీసం పట్టించుకోలేదని, ఆసుపత్రి వద్దనే ఈ విషయాన్ని తేల్చుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించేశారని ఆయన ఆరోపించాడు. ‘నా బాధను ఇంకెవరికి చెప్పుకోవాలి?’ అంటూ ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది.

నెట్టింట వెల్లువెత్తుతున్న ఆగ్రహం..

తన పెంపుడు కుక్క మృతదేహాన్ని పట్టుకుని యజమాని ఏడుస్తున్న వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ‘సమాజంలో కేవలం మనిషి ప్రాణానికే విలువుందా? మూగ జంతువుల ప్రాణాలకు లేదా?’ అంటూ నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పశుసంవర్ధక శాఖ అధికారులు, బ్లూ క్రాస్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది పై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story