Ap News: కర్నూలులో హైకోర్టు బెంచ్‌..!

by Disha Web Desk 16 |
Ap News: కర్నూలులో హైకోర్టు బెంచ్‌..!
X

దిశ, కర్నూలు ప్రతినిధి/ఆదోని: టీడీపీ అధికారంలోకొస్తే బీసీలకు స్వర్ణయుగం తెస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఆదివారం యువగళం పాదయాత్రలో భాగంగా పెద్దతుంబలం సమీపంలో బీసీ సామజిక వర్గం ప్రతినిధులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించింది టీడీపీ అని గుర్తు చేశారు. బీసీలను సీఎం జగన్ నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకొస్తానని, అలాగే ఆర్థిక సహాయం అందిస్తామని నారా లోకేశ్ హామీచ్చారు. ఉదయం పాదయాత్ర కడితోట గ్రామం నుంచి

ప్రారంభమైన యాత్ర గణేకల్, జలిమంచి క్రాస్, పాండవగళ్లకు చేరుకోగా అక్కడ అల్లరి మూకలు మద్యం మత్తులో అల్లర్లు సృష్టించి ఉద్రిక్తతకు దారి తీశారు. అలర్టైన తాలుకా సీఐ మహేశ్వర్ రెడ్డి అల్లరి ముకలను గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి అల్లర్లు సృష్టిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

అయితే పాండవగళ్లు గ్రామంలో కబ్జాకు గురైన 24 ఎకరాల చెరువును నారా లోకేష్ దృష్టికి సాధన కమిటీ సభ్యులు తీసుకొచ్చి వినతిపత్రం అందజేశారు. పక్కనే ఉన్న చెరువును సందర్శించాలని లోకేష్ ను కోరారు. ఒక గ్రామానికి చెందిన సమస్య అయితే అది తన సమస్యేనని, తాను ఈ సమస్యపై ప్రత్యేక శ్రద్ధ చూపి కబ్జాదారుల నుంచి చెరువును అన్యక్రాంతం కాకుండా చూసి ఆ చెరువును కానుకగా ఇస్తానన్నారు. అక్కడి నుంచి బల్లెకల్లు క్రాస్, కుప్పగల్లు క్రాస్ నుంచి పెద్ద తుంబలం చెరువు దగ్గర్లో మధ్యాహ్నం భోజనం చేశారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు

కర్నూలులో హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని టీడీపీ నేత నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌లా మాయమాటలు చెప్పి మోసం చేసేవాళ్లం కాదన్నారు. యువనేత లోకేష్‌తో ఆదోని నియోజకవర్గం కుప్పగల్లులో న్యాయవాదులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హైకోర్టు వైజాగ్‌లో అంటాడు, జగన్ రాయలసీమలోనే హైకోర్టు అని మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. జగన్‌లా కర్నూలులో ఒక మాట చెప్పి ఢిల్లీలో మరోమాట చెప్పే దుర్మార్గపు ఆలోచన తనకు లేదన్నారు. నాలుగేళ్లుగా మాయమాటలు చెబుతున్న జగన్ కర్నూలులో కనీసం స్థలం కేటాయించి, ఒక్క ఇటుక పెట్టాడా ? అని ప్రశ్నించారు. జగన్ చెప్పే అబద్దాలు తియ్యగా, తాము చెప్పే నిజాలు చేదుగా ఉంటాయన్నారు. విజ్ఞులైన న్యాయవాదులు నిజానిజాలను గుర్తించాలని ఆయన సూచించారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుందని, అధికారంలోకి వచ్చాక ఏర్పాటు చేస్తామని హామీచ్చారు. అలాగే జూనియర్ లాయర్లకు స్టైఫండ్ కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే న్యాయవాదుల సమస్యలను పరిష్కరించి ఆదుకుంటామని భరోసానిచ్చారు.

Also Read..

Kurnool: బీఆర్ఎస్‌లోకి వెళ్లరట..!

Next Story

Most Viewed