Nara lokesh: దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట

by Disha Web Desk 16 |
Nara lokesh: దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట
X

దిశ, కర్నూలు ప్రతినిధి: దొంగలెక్కలు సృష్టించడంలో ఆర్థిక మంత్రి దిట్ట అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం పాములపాడు మండల కేంద్రంలో ఎస్సీలతో నిర్వహించిన ముఖాముఖిలో లోకేష్ మాట్లాడారు. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడని, నిధులు కేటాయిస్తాడే తప్ప ఖర్చు చేయడన్నారు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించామన్నారు. దళిత సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేశామ‌ని, 3 వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామని, విదేశీ విద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశారన్నారు. 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారన్నారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశారని మండిపడ్డారు.

అంబేద్కర్ పేరును విదేశీ విద్య పథకానికి చంద్రబాబు పెడితే, జగన్ దానిని తీసేసి తన పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకొచ్చాక దళితులకు జానాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తామన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్య అందించడానికి బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకం తెచ్చామని, దానిని జగన్ రద్దు చేయడం పేదలను ఉన్నత విద్యకు దూరం చేయడమేనన్నారు. తాము అధికారంలోకొచ్చాక ఈ పాఠశాల లను తిరిగి ప్రారంభిస్తామని హామిచ్చారు. 2014లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్‌లోనూ రాష్ట్రంలో సంక్షేమాన్ని అందించిన వ్యక్తి చంద్రబాబు అని, జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో యువతకు ఇచ్చిన ఏ హామిని నెరవేర్చలేదన్నారు. 2025 జనవరిలో తాము మెగా డీఎస్సీ ప్రకటిస్తామన్నారు. 5 ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. రాయలసీమ ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్ ఈ రాయలసీమ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో 2.70 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించామని, ఈ సారి 5 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. అబద్దాలు, మోసం, నయవంచన కలిసిన మానవ రూపాన్ని సీఎం జగన్‌ అంటారని లోకేష్ ధ్వజమెత్తారు.

Next Story

Most Viewed