అరకోర ఫైన్లతో ఆర్భాటం: మంత్రాలయంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం!

by Thanuru Gopichand |

నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో తుంగభద్రా నది నుంచి అక్రమ ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది.

అరకోర ఫైన్లతో ఆర్భాటం: మంత్రాలయంలో ఇసుకాసురుల ఇష్టారాజ్యం!
X

దిశ, మంత్రాలయం: నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయంలో తుంగభద్రా నది నుంచి అక్రమ ఇసుక తరలింపు యథేచ్ఛగా కొనసాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, మైనింగ్ అధికారుల మౌనం ఇసుకాసురులకు వరంగా మారింది.

సరిపోని 'అరకోర' ఫైన్లు..

అప్పుడప్పుడు అధికారులు తనిఖీలు చేస్తున్నా, కేవలం నామమాత్రపు 'అరకోర' ట్రాక్టర్లను పట్టుకుని, వాటికి విధించే స్వల్ప ఫైన్లతో సరిపెట్టుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఫైన్లను తమ వ్యాపార ఖర్చుగా భావిస్తున్న ఇసుకాసురులు (ఇసుక మాఫియా) రోజురోజుకు ఇసుక తరలింపును తీవ్రతరం చేస్తున్నారు. దూరాన్ని బట్టి ఒక్కో ట్రిప్పు ఇసుక రూ.2,000 నుంచి రూ.5,000 వరకు గిట్టుబాటవుతుండగా, ఫైన్ అనేది ఒక ట్రిప్ ధర మాత్రమే కావడంతో వారికి అడ్డుకట్ట పడడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

విలేకరిపై దాడి – పోలీస్ స్టేషన్ లో పంచాయితీ

ఇసుక మాఫియా అన్యాయాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో సోమవారం రోజున ఒక ప్రముఖ పత్రికా విలేఖరి అధికారులకు సమాచారం ఇచ్చారు. తద్వారా అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ విలేకరికి, ఇసుకాసురులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎమ్మార్వో వెంటనే పారిపోయిన ట్రాక్టర్లను వదిలిపెట్టి, ఉన్న ట్రాక్టర్లకు మొదటిసారిగా రూ.10,000 ఫైన్ విధించారు. ఇంతటి ఫైన్ విధించడం ఇదే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు.

అయితే, అనంతరం ఇసుకాసురులు ఆ పత్రికా విలేకరి, అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారంటూ వాగ్వాదానికి దిగారు. అధికారులు తెలివిగా తప్పించుకోగా, విలేకరిపై ఇసుకాసురులు దాడి చేయబోయారు. దీంతో విలేకరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, దానికి బదులుగా తమను డబ్బుతో వేధిస్తున్నారని ఇసుకాసురులు ఆరోపించడంతో పంచాయితీ పోలీస్ స్టేషనుకు చేరింది.

చర్చలు-ప్రతిఘటన

రాజకీయ ప్రతినిధుల సమక్షంలో ఇరువర్గాల మధ్య రాజీ చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో పాత ఇసుకాసురులు తప్పించుకుంటున్నారని, కొత్తవారు బలవుతున్నారని, అలాగే బేరసారాలు కుదరనప్పుడే ఈ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ ముందే ఇరువర్గాలు తొడలు చరుచుకొని తిట్టుకోవడంపై ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై మైనింగ్ అధికారులు కూడా తక్షణమే దృష్టి సారించి, పటిష్టమైన నివారణ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Next Story