నంద్యాల | ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టుల కలకలం

by Thanuru Gopichand |

నంద్యాల జిల్లాలోని (Nandyal) కొలిమిగుండ్ల మండలం పరిధిలోని ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) సంచరిస్తున్నారనే సమాచారం స్థానికంగా కలకలం సృష్టించింది.

నంద్యాల | ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టుల కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలోని (Nandyal) కొలిమిగుండ్ల మండలం పరిధిలోని ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టులు (Maoists) సంచరిస్తున్నారనే సమాచారం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్ నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. ఎర్రమల కొండ ప్రాంతంలో కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. ఎర్రమల కొండ ప్రాంతంలో ముమ్మర గాలింపును చేపట్టాయి. ​మావోయిస్టుల ఉనికిపై వచ్చిన పక్కా సమాచారం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచిదాదాపు 20 మందికి పైగా పోలీసులు కొలిమిగుండ్లకు బయలుదేరి వచ్చారు. రెండు ప్రత్యేక వాహనాల్లో కొలిమిగుండ్ల ప్రాంతానికి చేరుకున్నారు. ఈ బృందాల్లోని పోలీసు సిబ్బంది ఎర్రమల కొండలోని సున్నిత ప్రాంతాలైన నేల బిళం, ఓబులేసు కోన, ఎర్రకోన ప్రాంతాలలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రాంతం మావోయిస్టు షెల్డర్ జోన్ అనే అనుమానాలున్నాయి.

ఎర్రమలకొండ ఉన్న ​కొలిమిగుండ్ల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు అధికంగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ పరిశ్రమల్లో ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పని చేస్తున్నారని తెలుస్తోంది. మావోయిస్టులు ఈ కార్మికుల ముసుగులో లేదా ఈ ప్రాంతాన్ని తమకు షెల్టర్ జోన్‌గా భావించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్‌గఢ్ పోలీసు బృందాలు నేరుగా వచ్చి కూంబింగ్ చేపట్టినట్లు తెలియ వస్తోంది.

అయితే బెలుం పరిసర ప్రాంతాల్లో నక్సల్స్ సంచారానికి సంబంధించిన చరిత్ర ఉంది. సుమారు 10 సంవత్సరాల క్రితం జనశక్తి నక్సల్స్ ఇక్కడే సంచారించేవారని సమాచారం. గతంలో కూడా నక్సల్స్, పోలీసులకు మధ్య ఈ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో జరిగిన కాల్పుల ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. తాజాగా మావోయిస్టుల కోసం ముమ్మరంగా జరుగుతున్న కూంబింగ్ ఆపరేషన్ స్థానికులకు గత సంఘటనలను గుర్తు చేస్తోంది. దీంతో జిల్లావ్యాప్తంగా మావోయిస్టుల కదలికలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో గాలింపు చర్యలను మరింత విస్తృతం చేశారు. మావోయిస్టుల ఉనికిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

Next Story