- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలంలో వైభవంగా స్వర్ణరథోత్సవం
లోక కల్యాణం ఆకాంక్షిస్తూ వేద పండితుల సంకల్పం.

దిశ, శ్రీశైలం : ఆరుద్రా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం జరిపించారు. కాగా ఆరుద్రోత్సవంలో భాగంగా వేకువజామున శ్రీస్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి. అనంతరం స్వర్ణరథోత్సవం నిర్వహించారు. ఈ స్వర్ణరథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికీ ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాల మరణాలు రాకుండా ఉండాలని ప్రార్థించారు. దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. తరువాత రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేష పూజలను చేశారు. అనంతరం భక్తుల శివనామ స్మరణతో వేదమంత్రాలు నడుమ ఉదయం, 7.30 గంటలకు ఈ స్వర్ణ రథోత్సవం ప్రారంభమైంది. గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఈ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా రథోత్సవంలో పలు కళాబృందాల కోలాటం, తప్పెట చిందులు, మొదలైన జానపద కళారూపాలు కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రథోత్సవంలో సాంప్రదాయ నృత్యాలను ప్రదర్శించారు. ఈనాటి స్వర్ణ రథోత్సవంలో ధర్మకర్తల మండల అధ్యక్షుడు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఏం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, అర్చక స్వాములు పలు విభాగాల అధికారులు పర్యవేక్షణ సిబ్బంది పాల్గొన్నారు.






