సీఎం, డిప్యూటీ సీఎంకు దేవుడే బుద్ధి చెబుతాడు: ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి

by Thanuru Gopichand |

కేవలం రాజకీయ లబ్ధి కోసమే కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు.

సీఎం, డిప్యూటీ సీఎంకు దేవుడే బుద్ధి చెబుతాడు: ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
X

దిశ, మంత్రాలయం: తిరుమల పవిత్ర ప్రసాదం ‘లడ్డు’ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి స్వగ్రామమైన రాంపురంలోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. పవిత్రమైన తిరుపతి లడ్డు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బాలనాగిరెడ్డి మండిపడ్డారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లేని తప్పును ఉన్నట్లుగా చూపిస్తూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసిన ఈ ఇద్దరు నాయకులకు ఆ భగవంతుడే తగిన బుద్ధి చెబుతారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రాంపురంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నేతలు తెలిపారు. తిరుమల పవిత్రతను కాపాడాలని, రాజకీయాల కోసం దేవుడిని వాడుకుంటున్న వారిపై స్వామివారి ఆగ్రహం తప్పదని వారు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బసాపురం భీమిరెడ్డి, పెద్దకడబూరు పురుషోత్తం రెడ్డి, వగరూరు విశ్వనాథ రెడ్డితోపాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story